భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం పంచామృతాలతో అభిషేకం చేశారు. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేసి సమస్త నదీజలాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.
26 నుంచి భద్రాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 26 నుంచి అక్టోబరు 4 వరకు శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో శివాజీ తెలిపారు. దేవస్థానంలోని లక్ష్మీతాయారు అమ్మవారు 26న ఆదిలక్ష్మి, 27న సంతానలక్ష్మి, 28న గజలక్ష్మి, 29న ధనలక్ష్మి, 30న ధాన్యలక్ష్మి, అక్టోబరు 1న విజయలక్ష్మి, 2న ఐశ్వర్యలక్ష్మి, 3న వీరలక్ష్మి, 4న మహాలక్ష్మి అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇస్తారని చెప్పారు. 5న విజయదశమి, రామయ్యకు మహాపట్టాభిషేకం, విజయోత్సవం, శమీపూజ, ఆయుధ పూజ, శ్రీరామలీలా మహోత్సవం ఉంటాయని తెలిపారు.
బాలుజాదవ్ ఆశయాలను నెరవేర్చాలి
కూసుమంచి,వెలుగు: అడిషనల్ డీసీపీ బాలుజాదవ్ ఆశయాలను నెరవేర్చాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఆదివారం మండలంలోని లోక్యాతండాలో ఇటీవల మృతి చెందిన బాలుజాదవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జక్కేపల్లిలో ఇటీవల మృతి చెందిన ఎస్పీడీ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పెరికసింగారం గ్రామంలోని మాజీ సీడీసీ చైర్మన్ జూకూరి గోపాల్‌రావు నివాసంలో మీడియాతో మాట్లాడుతూ అధికారం ముఖ్యం కాదని, అభివృద్ధితోనే గుర్తింపు వస్తుందని చెప్పారు. శక్తివంచన లేకుండా జిల్లాను అభివృద్ధి చేశానని తెలిపారు. కార్యక్రమంలో సాధు రమేశ్‌రెడ్డి, మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ రామచంద్రునాయక్, మాజీ ఏఎంసీ చైర్మన్ సేట్రామ్నాయక్, కూరపాటి వేణు, జొన్నలగడ్డ రవికుమార్, సుధాకర్‌రెడ్డి, మహిపాల్, వీరభద్రం పాల్గొన్నారు.
ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్లు చేపట్టాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: దసరా సెలవుల్లోనే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్లు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య పోరాట కమిటీ రాష్ట్ర, జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలోని ధర్నా చౌక్‌లో ఆదివారం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిత్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలన్నారు. ఏడేండ్లుగా పదోన్నతులు, నాలుగేండ్లుగా ట్రాన్స్ఫర్లు లేక టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు టీచర్ల దీక్షకు సంఘీభావం ప్రకటించారు. జాక్టో నాయకులు బుర్రి రాజు, హరిలాల్, భుక్యా మోహన్, కిశోర్‌సింగ్, బి. రాజు, కృష్ణ, రాంబాబు, పాపారావు, స్వర్ణ జ్యోతి, వరలక్ష్మి, బాలు పాల్గొన్నారు.
ఈ నెల 13 నుంచి నిరసన ప్రదర్శనలు చేపట్టాలి
భద్రాచలం, వెలుగు: జతిన్‌దాస్ 93వ వర్ధంతి సందర్భంగా ఈ నెల13 నుంచి 19 వరకు రాజకీయ ఖైదీల విడుదల చేయాలని, మావోయిస్టులపై డ్రోన్ దాడులను ఆపాలని కోరుతూ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని మావోయిస్టు పార్టీ భద్రాద్రికొత్తగూడెం-, అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్ ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ నాయకత్వంలో జతిన్‌దాస్ బ్రిటీష్ సామ్రాజ్యవాదులపై రాజకీయ ఖైదీల విడుదల కోసం పోరాడారని, ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ లాహోర్ జైలులో చనిపోయారని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్న రాజకీయ ఖైదీల విడుదల కోసం పోరాడాలన్నారు. అర్బన్ నక్సల్స్ పేరుతో ఎన్ఐఏ దాడులు చేసి బూటకపు సాక్ష్యాలను సృష్టించి ఉపా, రాజద్రోహం వంటి కేసులు బనాయిస్తోందని ఆరోపించారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
కామేపల్లి, వెలుగు: ప్రతీ కార్యకర్త కష్టసుఖాల్లో అండగా ఉంటామని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. మండలంలోని లాల్యతండా గ్రామానికి చెందిన అజ్మీరా వేదిక్ నాయక్ కు చికిత్స నిమిత్తం సీపీఎం ఎమ్మెల్సీ సిఫారసుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును ఆదివారం బాధిత కుటుంబానికి అందజేశారు. బాదావత్ శ్రీనివాస్, ఎర్ర శ్రీకాంత్, కృష్ణ, గుడ్ల వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, గబ్రు నాయక్, శ్రీను, రవి పాల్గొన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని నిరసన
ములకలపల్లి, వెలుగు: పెంచిన నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గించాలని ఆదివారం కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రసన్న ఆధ్వర్యంలో ములకలపల్లి బస్టాండ్ సెంటర్లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మెడలో కూరగాయల దండలు వేసుకొని, వంట గ్యాస్ సిలిండర్ ను సెంటర్ లో ఉంచి కోలాటం ఆడి నిరసన తెలిపారు. జడ్పీటీసీ నాగమణి, బూరుగుపల్లి పద్మశ్రీ, ఏసుమణి, గుర్రం జయసుధ, జమున, మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తాండ్ర ప్రభాకరరావు, ఓబీసీ మండల అధ్యక్షుడు పుష్పాల హనుమంత్, ఎండీ అంజుం, ఖాదర్ బాబా, జహీర్, పాలకుర్తి రత్న భూషణం, గుంటూరు ముత్తయ్య, కోండ్రు రవి, గుర్రం కృష్ణ, పొడియం వెంకటకృష్ణ, తుర్సం చిట్టిబాబు, అశోక్ పాల్గొన్నారు.
హత్యా రాజకీయాలు ఎవరు చేసినా తప్పే
ఖమ్మం రూరల్, వెలుగు: హత్యా రాజకీయాలు ఎవరు చేసినా తప్పేనని, ఇలాంటి సంఘటనలను ఎవరూ ప్రోత్సహించినా శిక్ష అనుభవించక తప్పదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని తెల్దారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య ఫొటోకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో పదవులు, అధికారం వస్తూ, పోతూ ఉంటాయని అన్నారు. ఆంధ్రా బ్యాంక్ కర్షక సేవ సంఘం అధ్యక్షుడు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మువ్వా విజయ్ బాబు, టీఆర్ఎస్ జిల్లా నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, తుళ్లూరు బ్రహ్మయ్య, అశోక్ సాయి పాల్గొన్నారు.
సేవాలాల్ సేన కరపత్రాల విడుదల
పాల్వంచ, వెలుగు: మండలంలోని తోగ్గూడెంలో సేవాలాల్ సేన 8వ ఆవిర్భావ వేడుకల కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. సేవాలాల్ సేన ఆవిర్భవించిన తర్వాత గిరిజనులకు అనేక రకాల సౌలతులు వచ్చాయని మండల గౌరవ అధ్యక్షుడు లాల్ సింగ్, అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు. మహాసభలను గ్రామ గ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు.
పలువురిని పరామర్శించిన సీపీఎం నేత తమ్మినేని
కారేపల్లి,వెలుగు: ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మండలంలోని సీపీఎం నాయకుల కుటుంబాలను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరామర్శించారు. ఎర్రబోడు గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన మాజీ సొసైటీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కారేపల్లిలో రావూరి లక్ష్మీబాయి సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు. సీపీఎం లీడర్లు పోతినేని సుదర్శన్‌రావు, నున్నా నాగేశ్వరరావు, భుక్యా వీరభద్రం పాల్గొన్నారు.
‘సొంత పార్టీ లీడర్లే పట్టించుకుంటలేరు’
చండ్రుగొండ, వెలుగు: అధికార పార్టీ నుంచి గెలిచిన తనను పార్టీ లీడర్లు దూరం పెడుతున్నారని ఎంపీపీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చండ్రుగొండ రైతువేదిక ఆవరణలో పింఛన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో తనను భాగస్వామ్యం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తప్పు చేశానని పార్టీకి దూరంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని తనకు సముచిత స్థానం కల్పించాలని కోరగా, ఎమ్మెల్యే సానుకూలంగా స్వందించారు. అనంతరం చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో కొత్తగా మంజూరైన పింఛన్ల గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎంపీపీలు పార్వతి, లలిత, ఎంపీడీవోలు అన్నపూర్ణ, రేవతి, జడ్పీటీసీలు వెంకటరెడ్డి, ఎంపీటీసీ దారా వెంకటేశ్వరావు పాల్గొన్నారు.
ఫోన్ చేస్తే సమస్య పరిష్కరిస్తా
ములకలపల్లి: గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా తనకు ఒక్క ఫోన్ చేస్తే వెంటనే వచ్చి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం ములకలపల్లి రైతువేదిక ఆవరణలో 930 మందికి ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఆధ్వర్యంలో స్వచ్ఛ గురుకుల డ్రైవ్ వాల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఎంపీపీ నాగమణి, జడ్పీటీసీ సున్నం నాగమణి, సర్పంచ్ భద్రం, ఎంపీడీవో నాగేశ్వరరావు, తహసీల్దార్ వీరభద్రం పాల్గొన్నారు.
టీఆర్ఎస్లో చేరికలు
ఎర్రుపాలెం,వెలుగు: మండలంలోని పెగళ్లపాడు గ్రామానికి చెందిన వంద మంది ఆదివారం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరడం అభినందనీయమన్నారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన పెగళ్లపాడు సర్పంచ్ రాజేశ్వరి భర్త వెంకటకృష్ణతో పాటు జమలాపురంలో పాముకాటుతో చనిపోయిన రైతు సమన్వయ సమితి సభ్యుడు తుళ్లూరు సీతారామయ్య కుటుంబసభ్యులను, ఎర్రుపాలెం గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త సరోజిని మనవడు మరణించగా, ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. జిల్లా నాయకుడు చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, సర్పంచుల సంఘం అధ్యక్షుడు మొగిలి అప్పారావు, ఎంపీటీసీ కిశోర్ బాబు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
పాల్వంచ,వెలుగు: మండలంలోని ప్రసిద్ధి చెందిన పెద్దమ్మ తల్లి అమ్మవారిని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. అమ్మ వారికి బోనాలు, ఒడిబియ్యం, చీరలు, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉప ఆలయాల్లో అన్న ప్రాసన, వాహనపూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ధర్మకర్తల మండలి చైర్మన్ మహిపతి రామలింగం, సభ్యులు చింత నాగరాజు, గంధం వెంగళరావు, కిలారు నాగమల్లేశ్వరరావు, సందుపట్ల శ్రీనివాసరెడ్డి, సువాలీ ఏర్పాట్లు చేశారు.