చాట్జీపీటీతో 90శాతం ఆదాయాన్ని కోల్పోయా.. కోల్కతా విద్యార్థినీ ఆవేదన ఇది!

చాట్జీపీటీతో 90శాతం ఆదాయాన్ని కోల్పోయా.. కోల్కతా విద్యార్థినీ ఆవేదన ఇది!

చాట్ జీపీటీ వచ్చిన తర్వాత చాలామంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగాలు ఉంటాయా...? పోతాయా..? అనే టెన్షన్ నిత్యం అందర్నీ వెంటాడుతోంది. ఎందుకంటే మనుషులు చేసే పనిని చాట్ జీపీటీ నిమిషాల్లో చేసేస్తోంది. తాజాగా కోల్కతాకు చెందిన ఓ విద్యార్థినీ చాట్ జీపీటీతో తనకు జరిగిన నష్టాన్ని అందరితోనూ షేర్ చేసుకుంది.

కోల్‌కతాకు చెందిన శరణ్య భట్టాచార్య అనే 22 ఏళ్ల విద్యార్థిని డిగ్రీ చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేస్తోంది. ఇంట్లో వాళ్లను ఖర్చులకు డబ్బులు అడగకుండా పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తోంది. ఇంటి దగ్గరలో ఉన్న క్రియేటివ్‌ సొల్యూషన్స్‌ ఏజెన్సీకి కాపీరైటర్‌గా ఫ్రీలాన్సింగ్‌ చేస్తోంది. ఎస్‌ఈవోకి అనుగుణంగా కొన్ని స్టోరీలను రాసి నెలకు దాదాపు రూ.20 వేల వరకు (గత 2, 3 నెలల క్రితం వరకు) సంపాదించేది. 

అయితే..  గత రెండు నెలల నుంచి శరణ్య ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. వర్క్ లోడ్ బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం నెలకు 1 లేదా 2 కథనాలకు మాత్రమే సదరు ఏజెన్సీ అవకాశం కల్పిస్తోంది. అంటే తనకు వచ్చే నెలవారీ ఆదాయానికి దాదాపు 90 శాతం మేర కోత పడుతోంది. ఎందుకు వర్క్ ఇవ్వడం లేదని అడిగినా.. సరైన సమాధానం దొరకలేదు. తాను చేసే పనిని కృత్తిమ మేధతో (చాట్ జీపీటీ సహయంతో) చేయించుకుంటున్నారని తెలిసి బాధపడింది. ఇలా రెండు నెలల నుంచి వర్క్ లేక ఇబ్బంది పడుతోంది. ఇంట్లోవాళ్లను డబ్బులు అడగలేక సతమతమవుతోంది. తనకు వచ్చిన ఆదాయంతో చదువుకుంటూనే.. ఇంటి దగ్గర ఉన్న 45 ఏళ్ల తన తల్లికి కూడా చేదేడుగా నిలిచేదాన్నని, తన జీతంలో కోత ప్రభావం కుటుంబంపైనా పడిందని ఆవేదన వ్యక్తం చేసింది శరణ్య భట్టాచార్య. 

శరణ్య తల్లి చీరలు విక్రయిస్తారు. ఖర్చుల కోసం ఆమెను డబ్బులు అడగడం బాధగా ఉందని చెబుతోంది శరణ్య. ఇంటి ఖర్చుల కోసం లెక్కలు వేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. చాట్ జీపీటీ తన జీవితాన్ని కష్టాల్లోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. యంత్రాలు చేసే పనికి, మనుషులు చేసే పనికి చాలా తేడా ఉంటుందని చెబుతూ.. ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని సంస్థలు నిర్ణయాలు తీసుకోవాలని అభ్యర్థించింది. లేదంటే చాలా మంది రోడ్డున పడాల్సి వస్తుందని హెచ్చరించింది.