- శరద్ పవార్ మా దైవం.. ఆయనపై గౌరవం ఉంది: అజిత్
- బీజేపీలో 75 ఏండ్లకే రిటైర్ అయితరు.. మీకేమో 83 ఏళ్లు
- తమకు ఆశీస్సులు అందించాలని శరద్ పవార్‌కు విజ్ఞప్తి
- బీజేపీతో కలిసినోళ్లు నాశనమే..
- పార్టీని పోగొట్టుకోనంటూ శరద్ పవార్ శపథం
ముంబై/పుణె: ఏదో ఒకరోజు తాను ముఖ్యమంత్రిని కావాలని అనుకుంటున్నానని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ రెబల్స్‌కు నాయకత్వం వహిస్తున్న అజిత్ పవార్ అన్నారు. 83 ఏండ్ల శరద్ పవార్ తమ దైవమని, ఆశీస్సులు అందించాలని అంటూనే.. ఆయన ఇక రిటైర్ కావాలని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీతో చేతులు కలిపిన వాళ్లు చివరికి రాజకీయంగా నాశనమవుతారంటూ శరద్ పవార్ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్సీపీ పేరు, సింబల్‌ను ఎక్కడికీ పోనివ్వబోనని శపథం చేశారు. అంతకుముందు ఇద్దరు నేతలు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించగా.. అజిత్ వద్దకు ఎక్కువ మంది వచ్చారు. మరోవైపు ముంబైలోని చాలా చోట్ల శరద్‌పవార్, అజిత్ పవర్‌కు మద్దతుగా పోస్టర్లు వెలిశాయి.
శరద్‌పై ఎంతో గౌరవం ఉంది: అజిత్
83 ఏండ్ల శరద్ పవార్ ఇక రాజకీయాల నుంచి రిటైర్ కావాలని అజిత్ పవార్ అన్నారు. ‘‘బీజేపీలో 75 ఏండ్లకే రిటైర్‌మెంట్ తీసుకుంటారు. మరి మీరు ఎప్పుడు ఆపబోతున్నారు? ప్రతి ఒక్కరికీ తమ ఇన్నింగ్స్ ఉంటుంది. అత్యంత ప్రొడక్టివ్ ఇయర్స్.. 25 నుంచి 75 ఏండ్ల మధ్య ఉంటాయి” అని చెప్పారు. 2004లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు ఎన్సీపీకి వచ్చాయని, కానీ సీఎం పదవిని కాంగ్రెస్‌కు అప్పగించారని విమర్శించారు. ‘‘మనకు శరద్ పవార్ దైవం. ఆయనపై ఎంతో గౌరవం ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లు 60 ఏండ్లకు రిటైర్ అవుతారు. రాజకీయాల్లో కూడా బీజేపీ లీడర్లు 75 ఏండ్లకు రిటైర్ అవుతున్నారు. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ తదితరులు ఇందుకు ఉదాహరణ. మీకు 83 ఏండ్లు. మరి మీరు ఆగడం లేదా? మీ ఆశీస్సులు మాకు అందించండి. మీరు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తాం’’ అని అజిత్ అన్నారు.
ప‘వార్’లో అ‘జీత్’
ఎన్సీపీలోని రెండు వర్గాలు శరద్‌పవార్, అజిత్ పవార్ ఆధ్వర్యంలో వేర్వేరుగా సమావేశమయ్యాయి. ముంబైలోని వైబీ చవాన్ సెంటర్‌లో శరద్ పవార్, భుజ్‌బల్ నాలెడ్జ్ సిటీలో అజిత్ పవార్ మీటింగ్ నిర్వహించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజిత్ నిర్వహించిన భేటీకి 32 మంది హాజరయ్యారు. అయితే ఆయన మాత్రం తనకు 40 మంది మద్దతు ఉందని చెబుతున్నారు. మరోవైపు శరద్ నిర్వహించిన మీటింగ్‌కు 18 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. కొందరు ఎమ్మెల్యేలు రెండు సమావేశాలకు హాజరుకాగా, మరికొందరు రెండింటికీ దూరంగా ఉన్నారు. ఈ రోజు జరిగిన సమావేశానికి ముందు ఎమ్మెల్యేలకు అజిత్ పవార్ వర్గం నేతలు ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తమ వెంట రావాలని, బదులుగా 2024 ఎన్నికల్లో సాయం చేస్తామని చెప్పినట్లు సమాచారం. ‘‘మీ నియోజకవర్గంలో పూర్తి కాని ప్రాజెక్టులు ఉన్నా, నిధులు రిలీజ్ కాకున్నా.. సాయం చేస్తాం. నిధులు వచ్చేలా చేస్తాం” అని చెప్పినట్లు సమాచారం.
నా ఫొటో ఎందుకు పెట్టుకున్నరు: శరద్
అజిత్ పవార్ సమావేశంలో తన ఫొటో పెట్టడంపై శరద్ పవార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాళ్ల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదని వాళ్లకు తెలుసని, అందుకే తన ఇమేజ్‌ని ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. వాళ్లు తన ఫొటో ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. పార్టీ పేరు, చిహ్నాన్ని పోనివ్వబోనని స్పష్టం చేశారు. ‘‘ఈ రోజు మనం అధికారంలో లేకపోవచ్చు.. కానీ ప్రజల గుండెల్లో ఉన్నాం. బీజేపీకి మిత్రపక్షంగా ఉండే ప్రతి ఒక్కరూ రాజకీయ విధ్వంసాన్ని ఎదుర్కొన్నారు. దాన్నే వీళ్లు కూడా ఎదుర్కొంటారు” అని అన్నారు. బీజేపీతో చేతులు కలిపి అధికారాన్ని పంచుకునే వాళ్లు చివరికి రాజకీయంగా నాశనమవుతారని, తన రాజకీయ మిత్రులను క్రమంగా నిర్వీర్యం చేయడం బీజేపీ విధానమని, ఇతర రాష్ట్రాల్లో ఇందుకు ఉదాహరణలు ఉన్నాయని అన్నారు.