![శ్రావణమాసంలో ఏ దేవుళ్లను పూజించాలి...](https://static.v6velugu.com/uploads/2023/08/Sharavana-Masam-2023-Significance-Poojas_VnhY7jHvAI.jpg)
తెలుగు మాసా(నెల)లలో శ్రావణమాసం చాలా ప్రత్యేకమైనది.. విశిష్టమైనది. శివకేశవులు అనే భేదము లేకుండగా ఇద్దరినీ పూజించే మాసం శ్రావణమాసమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారము చంద్రుడు శ్రవణా నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది. శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రము శ్రవణా నక్షత్రమని.. శ్రావణ మాసము లక్ష్మీదేవికి చాలా ప్రీతియని పురాణాలు తెలుపుతున్నాయి. శ్రావణ మాసంలో కృష్ణావతారము, హయగ్రీవ అవతారము జరిగాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రావణమాసంలో అన్నిరోజులు పవిత్రమైనవే.ఈ ఏడాది నిజ శ్రావణ మాసం ఆగస్టు 17 గురువారం నుంచి 15 సెప్టెంబరు 2023 శుక్రవారం వరకు ఉంటుంది. శ్రావణ సోమవార శివారాధన, మంగళ గౌరీ వ్రతాలు, వరలక్ష్మీ పూజలు, నాగ పంచమి, పుత్రద ఏకాదశి, జంద్యాల పూర్ణిమ (శ్రావణ పూర్ణిమ) లాంటి పండుగలు, పూజలు నిజ శ్రావణ మాసంలోనే జరుపుకోవాలని ఆధ్యాత్మిక వేత్తలు , పంచాంగకర్తలు చెబుతున్నారు.
శివారాధన చేయాలి
పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించినటువంటి మాసం శ్రావణం. శావణమాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలము బయటకు వచ్చిందని, ఈ విషం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుడిని ప్రార్థించగా.. శివుడు గౌరీదేవిని చూసెను. గౌరీదేవి తన మాంగల్యబలంపై నమ్మకంతో ఈశ్వరునితో ఈ సృష్టి దేవతలు అందరూ మన సంతానమే వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివున్ని ఆ గరళాన్ని స్వీకరించాలని కోరెను. శివుడు శ్రావణమాసంలో విషాన్ని గరళమునందు పెట్టుకొని లోకాన్ని రక్షించినందుకు శ్రావణ మాసంలో సోమవారాలు భారతదేశంలో ఉన్న 'హైందవులందరూ భక్తి శ్రద్దలతో శ్రావణమాసమంతా ఈశ్వర ఆరాధన చేస్తారు. శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో శివుని పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుందని వేద పండితులు చెబుతున్నారు.
మంగళగౌరి వ్రతం ఎందుకు
అమ్మవారి మాంగల్యబలంతో శివుడు ఈ పని చేసాడు కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. జాతకములో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నివృత్తి అవుతుందని ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్తలు వెల్లడిస్తున్నారు. మంగళగౌరి వ్రతం గురించి నారదమహర్షి సావిత్రీదేవికి చెప్పినట్లుగా, అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలలో ఉంది.
విష్ణు పూజ
శ్రావణమాసంలో బుధవారాలు మహావిష్ణువును పూజించడం విశేషం. శ్రావణ బుధవారాలు పాండు రంగ విఠలుడను ప్రత్యేకంగా పూజిస్తారు. శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్ర నామము వంటివి పారాయణ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని విష్ణుపురాణంలో పేర్కొన్నారు.
వరలక్ష్మీ వ్రతం విశిష్టత
శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. హిందూ పురాణాల ప్రకారం అష్టలక్ష్ములున్నారు. అష్ట లక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్లే అని శాస్త్రాలు చెబుతున్నాయట. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మానవుల జీవితములో దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితిని నుంచి బయటకు రావడానికి వరలక్ష్మీ వ్రతాన్ని మించిన వ్రతం లేదని పురాణాల్లో ఉన్నదని వేద పండితులు చెబుతున్నారు. . వరలక్ష్మీ వ్రతము గురించి స్కంద పురాణములో తెలిపారు. స్కంద పురాణం ప్రకారం ఒకానొక సమయంలో పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న అడిగింది. లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్రపౌత్రాదులను పొందేటటువంటి వీలున్న ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి అడగగా పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి స్కంద పురాణములో చెప్పారు. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడము ఉత్తమము. చారుమతి దేవి కథ ప్రకారము.. ఒకనాడు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనబడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది. ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము వరలక్షీదేవిని ఆరాధించడం వలన చారుమతి దేవి సమస్త సిరిసంపదలు అందుకోవడం వలన వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయడం ఆచారముగా వస్తోంది.
ఈ విధముగా శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన, మంగళవారాలు శక్తి ఆరాధన, బుధవారాలు విష్ణు భగవానుని ఆరాధన, శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధన వల్ల శ్రావణ మాసం శివకేశవులు అనే భేదం లేకుండా శివుడిని ఆరాధించి సత్ఫలితాలు పొందేటటువంటి మాసమని వేదాల్లో ఉందని పండితులు చెబుతున్నారు. .