శార్దూల్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ అత్యంత చెత్త రికార్డ్

శార్దూల్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ అత్యంత చెత్త రికార్డ్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  ఐపీఎల్‌‌‌‌లో చాన్స్‌‌‌‌ దక్కని  ముంబై బౌలర్‌‌‌‌‌‌‌‌ శార్దూల్ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ (1/69) ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌‌‌‌లో అత్యంత చెత్త బౌలింగ్ చేసి రికార్డుకెక్కాడు.   ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం కేరళతో జరిగిన మ్యాచ్‌‌‌‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 69 రన్స్ ఇచ్చుకున్నాడు. 

దాంతో ఈ టోర్నీ చరిత్రలో అత్యంత చెత్త బౌలింగ్‌‌‌‌ నమోదు చేసిన ఆటగాడిగా అరుణాచల్‌‌‌‌ ప్రదేశ్ బౌలర్‌‌‌‌‌‌‌‌ రమేశ్‌‌‌‌ రాహుల్ (0/69) రికార్డు సమం చేశాడు. ఆరంభంలోనే కేరళ కెప్టెన్‌‌‌‌ శాంసన్ (4) వికెట్‌‌‌‌ తీసిన శార్దూల్ తర్వాత ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్లు ఇచ్చుకున్నాడు. నిజార్ (99 నాటౌట్‌‌‌‌), రోహన్‌‌‌‌ (87) జోరుతో 20 ఓవర్లలో కేరళ 234/5 స్కోరు చేయగా.. ఛేజింగ్‌‌‌‌లో ముంబై ఓవర్లన్నీ ఆడి 191/9 రన్స్‌‌‌‌కే పరిమితమై 43 రన్స్ తేడాతో ఓడిపోయింది.  రహానె (68) పోరాడినా ఫలితం లేకపోయింది. 

పాండ్యా జోరు

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా   బరోడా జట్టు తరఫున జోరు కొనసాగిస్తున్నాడు. త్రిపురతో  గ్రూప్‌‌‌‌-– బి మ్యాచ్‌‌‌‌లో పాండ్యా (23 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 47 నాటౌట్‌‌‌‌) దంచికొట్టడంతో బరోడా 7 వికెట్ల తేడాతో గెలిచింది. త్రిపుర ఇచ్చిన 110 రన్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ను పాండ్యా  మెరుపులతో బరోడా 11.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేజ్‌‌‌‌ చేసింది. లెఫ్టార్మ్ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ పర్వేజ్ సుల్తాన్ ఓవర్లో పాండ్యా మూడు సిక్సర్లు సహా 28 రన్స్‌‌‌‌ రాబట్టడం గమనార్హం. 

ఢిల్లీ 11 మంది బౌలర్లతో

చిన్న జట్టు మణిపూర్‌‌‌‌‌‌‌‌తో గ్రూప్‌‌‌‌–సి మ్యాచ్‌‌‌‌లో ఢిల్లీ జట్టులోని 11 మంది ఆటగాళ్లు బౌలింగ్‌‌‌‌ చేశారు. రెగ్యులర్ కీపర్ అనుజ్ రావత్‌‌‌‌ సైతం బౌలింగ్ చేసిన ఈ పోరులో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత మణిపూర్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 120/8 స్కోరు చేయగా.. ఢిల్లీ 18.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.