MS Dhoni: రోహిత్‌కు కోపం వచ్చినా ధోనీనే నా బెస్ట్ కెప్టెన్: టీమిండియా ఆల్ రౌండర్

MS Dhoni: రోహిత్‌కు కోపం వచ్చినా ధోనీనే నా బెస్ట్ కెప్టెన్: టీమిండియా ఆల్ రౌండర్

టీమిండియా బెస్ట్ కెప్టెన్ అనగానే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఖచ్చితంగా ఈ లిస్ట్ లో ఉంటారు. వారి వారి శైలిలో జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించారు. అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డ్స్ టైటిల్స్ పరంగా చూసుకుంటే  రోహిత్ కంటే ధోనీ టాప్ లో ఉంటాడు. అయితే ఐపీఎల్ విషయానికి వస్తే రోహిత్, ధోనీ సమానంగా నిలుస్తారు. రోహిత్ ముంబై ఇండియన్స్ కు 5 ట్రోఫీలు అందిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ కు ధోనీ సైతం 5 ట్రోఫీలు సాధించి పెట్టాడు. 

అంతర్జాతీయ క్రికెట్ లో ధోనీ భారత్ కు టీ20 వరల్డ్ కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. మరోవైపు రోహిత్ శర్మ ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024 అందించాడు. వీరిద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరనే ప్రశ్న టీమిండియా ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ కు ఎదురైంది. ధోనీ, రోహిత్ లలో ఎవరు బెస్ట్ కెప్టెన్ అని అడిగినప్పుడు ధోనీ అని చెప్పాడు. రోహిత్ తన స్నేహితుడని.. అతనికి కోపం వచ్చినా ఈ విషయం అర్ధం చేసుకుంటాడని శార్దూల్ అన్నాడు.  

ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చి కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. 2025 ఐపీఎల్ సీజన్ ఆడతాడా లేదా అనే విషయం త్వరలో తెలియనుంది. రోహిత్ శర్మ విషయానికి వస్తే టీ20 వరల్డ్ కప్ 2024 టీమిండియా గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం భారత వన్డే, టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. రోహిత్, ధోనీ ఇద్దరూ కూడా ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.