ముంబై: గోల్డ్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ), ప్రావిడెంట్ ఫండ్స్ వంటి వాటి కంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వారికే ఎక్కువ లాభాలొచ్చాయి. 1986 లో సెన్సెక్స్ ఏర్పడినప్పటి నుంచి ఈ ఎసెట్స్ పెర్ఫార్మెన్స్‌ను ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ అధిగమిస్తోంది. తాజాగా కీలకమైన 50 వేల మైలురాయిని అందుకున్న సెన్సెక్స్, గత 35 ఏళ్లలో ఏడాదికి 13.5 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్(సీఏజీఆర్)తో పెరుగుతూ వచ్చింది. సేఫ్ ఎసెట్‌గా భావించే గోల్డ్ కేవలం 4.85 శాతం సీఏజీఆర్ నమోదు చేయడం గమనార్హం. ఇండియాలో ఎక్కువగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ప్రావిడెంట్ ఫండ్ల వైపు ప్రజలు చూస్తారు. వీటిలో డబ్బులు పెట్టడం వలన మంచి రిటర్న్ వస్తాయని, సేఫ్టీ కూడా ఉంటుందని భావిస్తారు. ఈ రెండు ఎసెట్స్ కూడా ఇన్వెస్టర్లకు లాభాలివ్వడంలో సెన్సెక్స్ తర్వాతే ఉన్నాయి. గత 35 ఏళ్లలో బ్యాంక్ ఎఫ్‌డీలు 8.9 శాతం సీఏజీఆర్, ప్రావిడెంట్ ఫండ్‌లు 10.5 శాతం సీఏజీఆర్ రిటర్న్‌లను ఇచ్చాయి. సిల్వర్ 4.33 శాతం సీఏజీఆర్‌తో పెరుగుతూ వచ్చాయి.
రిస్క్ ఎక్కువనే దూరంగా ఉంటున్నరు..
గతంలో ఇతర ఎసెట్స్ కంటే ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడూ ఎక్కువ లాభాలను ఇచ్చేవని, భవిష్యత్‌లో కూడా ఇలానే ఉంటుందని యెస్ సెక్యూరిటీస్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ హెడ్ అమర్ అంబానీ అభిప్రాయపడ్డారు. 2003 లో చూసినట్టే ఇప్పుడు కూడా ఇండియన్ మార్కెట్లు మంచి ఫామ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి మరిన్ని సంస్కరణలు వస్తాయని ఎక్కువగా నమ్ముతున్నామని చెప్పారు. కంపెనీల ఎర్నింగ్స్ గ్రోత్ మరింత మెరుగుపడుతుందని, యూఎస్ డాలర్ బలహీనంగా ఉండడంతో లిక్విడిటీ ఇన్ ఫ్లో కొనసాగుతుందని అంచనావేశారు. మార్కెట్లో ఓలటాలిటీ ఎక్కువగా ఉండడంతో వీటిలో ఇన్వెస్ట్ చేయడాన్ని చాలా మంది పక్కనపెట్టేస్తుంటారు. ఇంకా ఎఫ్‌డీ, అప్పులపై ఫిక్స్‌డ్ రిటర్న్స్ వస్తాయి కానీ ఈక్విటీలపై రిటర్న్స్ నిలకడగా ఉండవు. దీంతో ఇన్వెస్టర్లు నిలకడగా ఆదాయం వచ్చే అసెట్స్ వైపు చూస్తున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. ‘మార్కెట్లు అర్థం కాకపోవడం, రిస్క్ ఎక్కువగా ఉండడం, ఇంకా ఇతర కారణాల వలన స్టాక్ మార్కెట్లో పెట్టేందుకు ఇండియన్ ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం లేదు’ అని ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ అభిమన్యు సోఫత్ అన్నారు.
గోల్డ్ , ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సేఫ్టీ ఉంటుందని ఇండియాలో ఎక్కువ మంది వీటిలోనే డబ్బులు పెడుతుంటారు. కానీ గత 35 ఏళ్ల డేటాను గమనిస్తే స్టాక్ మార్కెట్లు వీటికి మించిన లాభాలను ఇన్వెస్టర్లకు అందించాయి. ప్రజల్లో ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెరుగుతుండడంతో ఈక్విటీ మార్కెట్ల వెపు కూడా వీరు చూస్తున్నారు. దానికి నిదర్శనమే సెన్సెక్స్ 50 వేల మైలు రాయిని ఈజీగా దాటేయడం..
గ్లోబల్ మార్కెట్లు పడినా..మన మార్కెట్లు పెరిగాయ్
ఇండియన్ స్టాక్ మార్కెట్లు వరసగా నాల్గో సెషన్‌లోనూ లాభాల్లో ముగిశాయి. ఐటీసీ, ఎస్‌బీఐ వంటి హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సరికొత్త రికార్డ్‌లను క్రియేట్ చేశాయి. సెన్సెక్స్ గురువారం సెషన్‌లో 50,687.51 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ హైని తాకింది. చివరికి 359 పాయింట్ల లాభంతో 50,614 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 14,896 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 14,913.70 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ గరిష్టాన్ని టచ్ చేసింది. బీఎస్‌ఈలోని కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 200 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది. గ్లోబల్ మార్కెట్లు నెగిటివ్‌లో ట్రేడవుతున్నప్పటికీ ఇండియన్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయని రిలయన్స్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ బినోద్ మోడీ అన్నారు. బడ్జెట్ తర్వాత ఇండియన్ ఎకానమీపై ఎఫ్‌ఐఐలు సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. టోక్యో, హాంకాంగ్, సియోల్, షాంఘై మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్ మారకంలో రూపాయి 72.96 వద్ద ఫ్లాట్‌గా ముగిసింది.
బీఎస్‌ఈలో లిస్ట్‌యిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 200 లక్షల కోట్లకు చేరుకోవడం గర్వంగా ఉంది. 1875 లో ఏర్పడినప్పటి నుంచి వెల్త్ క్రియేషన్‌లో బీఎస్‌ఈ కేటలిస్ట్‌గా పనిచేస్తోంది. ఏ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశం కూడా క్యాపిటల్ మార్కెట్‌లో ఇండియాతో సమానంగా లేదు. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా గ్లోబల్‌గా అతిపెద్ద 9 వ ఎక్స్చేంజ్‌గా బీఎస్‌ఈ ఉంది
-ఆశిష్‌కుమార్ చౌహాన్, బీఎస్‌ఈ ఎండీ అండ్ సీఈఓ