కరీంనగర్: అత్తగారి ఊరికి కూడా పరిహారం ఇవ్వలేని దిక్కుమాలిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిల చేస్తున్న పాదయాత్ర ఇవాళ 209వ రోజు చొప్పదండి నియోజకవర్గంలో జరిగింది. పాదయాత్రలో భాగంగా సాయంత్రం చొప్పదండిలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలన అంతా కుటుంబ సభ్యులు, పార్టీ నాయకుల దోపిడీమయంగా మారిందని దుయ్యబట్టారు.
చొప్పదండికి కేసీఆర్ అల్లుడు.. కేటీఆర్ మనవడు.. అల్లుడు, మనవడు ఇద్దరూ చేసింది ఏమిటి ? సిరిసిల్ల,గజ్వేల్ లా చొప్పదండిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కమీషన్ల రాజ అని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో నారాయణ పూర్ రిజర్వాయర్ కట్టించారని గుర్తు చేస్తూ.. ఇప్పుడు అదే ప్రాజెక్టుకి గండి పడితే పూడ్చడం కూడా కేసీఆర్ కు చేతకాదని.. నారాయణ పూర్ బాధితులకు ఒక్క రూపాయి కూడా సహాయం అందించలేదని విమర్శించారు.
వాటర్ హబ్.. లక్ష ఎకరాలకు నీళ్లు ఏవీ..?
చొప్పదండి నియోజక వర్గం వాటర్ హబ్ చేస్తామని.. -కాళేశ్వరం ప్రాజెక్ట్ తో లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామని.. ఇక్కడ నీళ్ళు ఇచ్చాకే మిగతా ప్రాంతాలకు అన్నారని గుర్తు చేస్తూ.. ఇక్కడ నీళ్లు ఇవ్వకుండా కేసీఅర్ ఫామ్ హౌజ్ కి పట్టుకు పోయారని ఆరోపించారు. మోతే రిజర్వాయర్ కట్టిస్తామన్నారు.. ఇంత వరకు అతీగతీ లేదు.. మిడ్ మానెర్ ప్రాజెక్టుతో ఈ నియోజక వర్గంలో 5 గ్రామాలు మునిగి పోతున్నాయని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక్కో కుటుంబానికి 5.4లక్షలు ఇస్తా అన్నారని గుర్తు చేస్తూ.. సిగ్గు లేకుండా సీఎం హోదా లో ఉండి ‘సారీ’ చెప్పారు.. సిగ్గు లేని ముఖ్యమంత్రి ‘సారీ’ చెప్పడం ఏంటి..? అని ప్రశ్నించారు. సిరిసిల్ల చేనేతలకు ఒక న్యాయం... చొప్పదండి చేనేతలకు ఇంకొక న్యాయమా..? అని నిలదీశారు. కొండగట్టు అంజన్న ను సైతం కేసీఅర్ మోసం చేశారని.. 100 కోట్లు ఇస్తామని చెప్పిన హామీ ఏమయ్యిందన్నారు. 8 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సరికదా.. కొండగట్టులో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగితే ఒక్కరినీ కూడా పరామర్శ చేయలేదన్నారు.
చొప్పదండి నియోజకవర్గానికి అల్లుడు కేసీఅర్... మనవడు కేటీఆర్.. ఎమ్మెల్యే సుంకే రవిశంకర్.. ముగ్గురు ఉన్నా.. ఏమి లాభం ? కేసీఅర్ భార్య సొంత ఊరు మిడ్ మానెర్ ముంపు గ్రామం.. అత్తగారి ఊరిని కూడా పట్టించుకోని కేసీఆర్ ఇక రాష్ట్రాన్ని ఎలా పట్టించుకుంటారు ? అని షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల ముందు తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదు.. మొత్తం అప్పులపాలయ్యానని చెప్పిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వందల కోట్లు ఎలా సంపాదించారు..? అని ప్రశ్నించారు.
దౌర్జన్యంగా భూములు లాక్కున్నాడని..కబ్జాలు చేసి.. పదవుల పేరు చెప్పి మొత్తం అమ్ముకుంటున్నారని.. కమీషన్ లేకుంటే ఏ పని చేయడట.. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచాం అనే సోయి కూడా లేకుండా అక్రమ సంపాదనలో మునిగితేలుతున్నాడని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం దగ్గర నుంచి ఎమ్మెల్యే ల వరకు అంతా తినడమే.. డిగ్రీలు, పీజీలు చదివినోళ్లు ఉద్యోగాల్లేక రోడ్ల మీద తిరుగుతుంటే కేసీఅర్ లో చలనం లేదు.. రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకులు రైతులను దొంగల్లా చూస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని షర్మిల విమర్శించారు.