కొంగు చాచి న్యాయం అడుగుతున్నాం.. షర్మిల

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ప్రహకారంలో పాల్గొంటున్న నేతల విమర్శ, ప్రతివిమర్శలతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల జగన్, అవినాష్ రెడ్డిలను ఉద్దేశించి మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంపించిన వారికి, చంపిన వారికి శిక్ష పడలేదని, హంతకులను జగన్ కాపాడుతున్నారని, అరెస్ట్ కాకుండా జగన్ అడ్డుపడుతున్నారని మండి పడ్డారు. తాను, సునీత కొంగు చాచి న్యాయం అడుగుతున్నామని అన్నారు.

హత్య కేసులో నిందితుడికి మళ్ళీ పట్టం కడుతున్నారని, అధికారం అడ్డు పెట్టుకొని అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అన్యాయం, అధర్మం అని అన్నారు. అన్యాయాన్ని ఎదురించేందుకే నిలబడ్డానని, తాను వైఎస్ఆర్ బిడ్డనని, దేనికి భయపడనని అన్నారు. చనిపోయింది వైఎస్ఆర్ తమ్ముడు అని, రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ కి వివేకా అలా ఉండేవారని అన్నారు. వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసనీ, సీబీఐ దగ్గర ఆధారాలున్నాయని, అవినాష్ రెడ్డి నిందితుడని అన్ని ఆధారాలున్నాయని అన్నారు.