జగిత్యాల/ మల్లాపూర్, వెలుగు : సీఎం కేసీఆర్ పాలన బీడీ బిచ్చం కల్లు ఉద్దెరగా ఉందని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల అన్నారు. ప్రత్యేక తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని జనం అనుకున్నారని, కానీ కేసీఆర్, ఆయన కుటుంబం, పార్టీ నేతలే బాగుపడ్డారని ఆమె విమర్శించారు. ఆమె ప్రజాప్రస్థానం యాత్ర శుక్రవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్, సంగెం, శ్రీరాంపూర్, దామరాజ్ పల్లి, మల్లాపూర్ మండల కేంద్రం మీదుగా కుస్తాపూర్, సిరిపూర్ రాఘవపేట గ్రామాల్లో కొనసాగింది. యాత్ర 2800 కి.మీకు చేరడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు షర్మిలకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతికి అంతు లేకుండా పోయిందని ఫైరయ్యారు.
ఎనిమిది ఏళ్లుగా కేసీఆర్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి, ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని రజాకార్ల తెలంగాణ, బీర్ల తెలంగాణగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ ఉంటేనే కేసీఆర్ తన ఫామ్ హౌజ్ నుంచి బయటకు వస్తారని, ప్రజల సమస్యలు పట్టించుకోరని మండిపడ్డారు. కోరుట్ల నియోజకవర్గంలో చెరుకు ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో తెరిపిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. చెరుకు రైతులకు మద్దతుగా శనివారం షుగర్ ఫ్యాక్టరీ వద్ద తలపెట్టిన ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.