పత్తి చేనులో మహిళా రైతులతో షర్మిల ముఖా - ముఖి

పత్తి చేనులో మహిళా రైతులతో షర్మిల ముఖా - ముఖి

కల్వకుర్తి, (నాగర్ కర్నూలు జిల్లా) : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర కల్వకుర్తి నియోజకవర్గంలో కొనసాగుతోంది. జోరు వర్షంలోనూ ప్రసంగంతోపాటు పాదయాత్ర కొనసాగించిన షర్మిల ఇవాళ కూడా పాదయాత్రతో ముందుకు సాగుతున్నారు. మంగళవారం షర్మిల పాదయాత్ర కల్వకుర్తి మండలం సుద్ధకల్ గ్రామానికి చేరుకుంది. దారిలో పొలాల్లో పనిచేసుకుంటున్న వ్యవసాయ కూలీలతో మాటా మంతీ జరుపుతూ.. క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. సుద్దకల్ గ్రామం వద్ద పత్తి చేనులో వ్యవసాయ కూలీలతో వైఎస్ షర్మిల ముఖా - ముఖి నిర్వహించారు. 

మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో వచ్చిన షర్మిలకు వ్యవసాయ కూలీలు తాము తింటున్న ఆహారాన్ని ఇవ్వగా షర్మిల ఆప్యాయంగా తిన్నారు. వ్యవసాయ కూలీలతో కలిసి పత్తి చేనులో వైఎస్ షర్మిల భోజనం చేశారు. మహిళ రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్న వైఎస్ షర్మిలకు మహిళా రైతులు తమ చేతితో షర్మిలకు గోరు ముద్దలు తినిపించారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని మహిళలు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్లీ తిరిగి తీసుకు వస్తానని షర్మిల హామీ ఇచ్చారు.