- వైఎస్ సంక్షేమ పాలన గుర్తుకు తెచ్చేలా పథకాలు
- ఇప్పటికే కొన్ని ప్రైవేట్ దవాఖానలతో చర్చలు
- నాలుగు మండలాలకు అంబులెన్సులు రెడీ
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్
- ఈనెలాఖరులో స్వయంగా ప్రకటించే అవకాశం
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లా పాలేరు కేంద్రంగా సంచలనాలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్లాన్చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో, మళ్లీ ఒకసారి వైఎస్సంక్షేమ పాలన గుర్తు చేసేలా పథకాలను రూపొందిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏ యే పథకాలను అమలు చేస్తామో చెప్పేందుకు మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో తాను పోటీ చేస్తానని వైఎస్షర్మిల ఇప్పటికే ప్రకటించడంతో అక్కడ ముందుగానే కొన్ని స్కీములను అమలు చేయాలని భావిస్తున్నారు. పేదలకు ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులకు గురి చేసే వైద్యం, విద్యపైనే ఫోకస్ చేయాలని ప్లాన్చేస్తున్నారు. ఈ రెండు అంశాల్లో నిరుపేదలకు అండగా ఉండే విధానాలను రూపకల్పన చేస్తున్నారు. వైఎస్‌హయాంలో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే గుర్తింపు కార్డులను ఇవ్వడం ద్వారా దవాఖానాల్లో ఉచిత వైద్యం అందించేందుకు యోచిస్తున్నారు. దీని కోసం కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌తో సంప్రదింపులు చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఖమ్మంలోనే కాకుండా అవసరమైన వారికి హైదరాబాద్‌లో కూడా ఉన్నత స్థాయి వైద్యానికి అయ్యే ఖర్చును పార్టీ భరించేలా ప్లాన్చేస్తున్నారు.
ముందు వైద్యంపైనే దృష్టి
పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్అందించేందుకు కొన్ని స్కూళ్లతో డిస్కస్ చేయాలని వైఎస్ఆర్టీపీ లీడర్లు ఆలోచిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలు చేసేందుకు ప్లాన్చేయడం, దానికి టైం ఉండడంతో ముందుగా వైద్యం పైనే కాన్సన్ట్రేట్ చేసినట్టు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో పేదలకు ఉపయోగపడేలా అంబులెన్స్సర్వీస్ను కూడా ఉచితంగా అందిస్తామంటున్నారు. ఇందుకోసం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నాలుగు అంబులెన్సులను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉన్నత విద్య చదివే స్టూడెంట్స్ఎవరైనా ఆర్థిక సాయం కోరితే అందించేందుకు యంత్రాంగాన్ని రెడీ చేస్తున్నారు. నిజంగా పేదరికం కారణంగానే ఉన్నత చదువులకు ఇబ్బందులు పడుతున్నట్టయితే వారికి తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
చనిపోయిన కుటుంబాలకు రూ.25 వేలు
పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి రెండేండ్లుగా నియోజకవర్గంలోని పేదలు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకి రూ.10 వేల చొప్పున సాయమందిస్తున్నారు. అయితే దానికి మరికొంత పెంచి, వివిధ కారణాలతో చనిపోయిన పేదల కుటుంబాలకు తమ పార్టీకి చెందిన నాయకులు, వ్యక్తిగత సహాయకుల ద్వారా రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్టీపీ నేతలు ఈ మధ్యే ప్రారంభించారు. ఇప్పటికే రూరల్మండలంలో కొన్ని కుటుంబాలకు పాతిక వేల చొప్పున సహాయం అందించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా తగిన మొత్తం అందించేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. గర్భిణికి రూ.10వేలు, అమ్మాయి పుడితే రూ.25వేల చొప్పున అందించే ఆలోచన కూడా ఉందని, పేదల ఇండ్లలో పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం చేయడం, ఇంకా మరికొన్ని ఆలోచనలు ప్రస్తుతం పార్టీ అంతర్గత పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న వైఎస్ షర్మిల, ఈనెల 19న హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే పాలేరులో ఆమె పర్యటన ఉంటుందని తెలుస్తోంది. ఆ సమయంలో కొన్ని కార్యక్రమాలను ప్రకటిస్తారని ముఖ్యనేతలు చెబుతున్నారు.
వైఎస్ షర్మిల సొంత డబ్బులతో..
ఖమ్మంలో జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికే కొనుగోలు చేసిన 2 వేల గజాల స్థలంలో షర్మిల భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి ఏరియాలో ఆఫీస్ తో పాటు ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. అది పూర్తి కావడానికి సమయం ఉండడంతో ముందుగా క్యాంప్ఆఫీస్ఏర్పాటుచేసేందుకు ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకోవాలని చూస్తున్నారు. అక్కడే సిబ్బందిని నియమించి ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ప్లాన్ చేస్తున్నారు. గత నెలలో షర్మిల పర్యటన సమయంలో పాలేరు ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. ‘పాలేరు మట్టి సాక్షిగా, మీ బిడ్డగా చెబుతున్నా. ఇకపై పాలేరు ప్రజల ప్రతి కష్టంలో, నష్టంలో అండగా ఉంటా’ అని ప్రకటించారు. దీనికి తగిన విధంగానే పేదల కనీస అవసరాలను తీర్చేలా పథకాలను రూపొందిస్తున్నట్టు పార్టీ లీడర్లు చెబుతున్నారు. వీటిని ముందుగా పాలేరులో ఇప్పటి నుంచే సొంత డబ్బులతో షర్మిల అమలు చేస్తారని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాలకు విస్తరించే ఆలోచన ఉందని చెప్తున్నారు.