లంచం తీసుకున్న ఎమ్మెల్యేల లిస్ట్​ను బయటపెట్టాలి

హైదరాబాద్, వెలుగు: దళితబంధు స్కీమ్​లో రూ.3 లక్షలు లంచం తీసుకున్న ఎమ్మెల్యేల లిస్ట్​ను సీఎం కేసీఆర్​బయటపెట్టాలని, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని బీఆర్​ఎస్ పార్టీ మీటింగ్​లో స్వయంగా కేసీఆరే ఒప్పుకున్నారని ఆమె గుర్తు చేశారు. ఆ ఎమ్మెల్యేల లిస్ట్ బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీఎం కేసీఆర్​కు షర్మిల లేఖ రాశారు. ‘‘ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తమ దగ్గర ఉందని చెప్పారు. ఆ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకుంటామన్నారు.

మరి వాళ్ల పేర్లు ఎందుకు బయట పెట్టరు. లిస్ట్ బయట పెడితే ఎమ్మెల్యేలు తెగిస్తారని భయమా?  వారి పేర్లు బయటపెడితే మీరే అవినీతిపరులని అంటారని ఆందోళనా?  కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మీరే  రూ.70 వేల కోట్లు తిన్నారు అని,  బిడ్డ లిక్కర్ స్కామ్​, కొడుకు రియల్ ఎస్టేట్ స్కామ్​ల గురించి అడుగుతారని భయమా? ” అని ఆమె లేఖలో ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు.. కరప్షన్ చంద్రశేఖర్ రావు’’ అని ఆమె ఆరోపించారు. ‘‘దళిత బంధులో నేనా.. లేక మిగతా స్కీమ్ లలో చేసిన అవినీతి చిట్టా కూడా ఉందా..’’ అని ఆమె ప్రశ్నించారు. 36 వేల మందికి దళిత బంధు ఇస్తే.. కేసీఆర్​ చెప్పిన లంచాల ప్రకారం అందులో వెయ్యి కో ట్ల అవినీతి జరిగిందని షర్మిల ఆరోపించారు.  

నేటి నుంచి వరంగల్​, ఖమ్మం జిల్లాల్లో పర్యటన

వర్షాలకు  పంట నష్టపోయిన రైతులను షర్మిల పరామర్శించనున్నారని ఆ పార్టీ నేత పిట్టా రాంరెడ్డి వెల్లడించారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, డోర్నకల్ నియోజకవర్గాల్లో,  ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో  పర్యటించనున్నారని ఆయన శుక్రవారం లోటస్ పాండ్ లో మీడియాకు తెలిపారు.