అమరావతి: తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై- రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసినా.. కేంద్ర సంస్థలతో కూడా దర్యాప్తు చేయించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ (సెప్టెంబర్ 21) గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన షర్మిల.. తిరుపతి లడ్డూ ఇష్యూపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. -లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ అంశం మీద గవర్నర్‌ను కలిశామని.. -లడ్డూ కల్తీపై బాధ్యులు ఎవరో తేల్చాలని కోరామని తెలిపారు.- ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలను సంబంధించిన విషయమని.. దీనిపై విచారణ జరిపి- కల్తీకి ఎవరు పాల్పడ్డారో తేల్చి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.
ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని.. ఫిష్, బీఫ్, పిగ్ కొవ్వుల నూనె ఉందని తేలిందన్నారు. స్వామి వారి ఆదాయం దాదాపు ఏడాదికి 3 వేల కోట్లకు పైగానే వస్తుందని.. ప్రపంచలోనే అత్యంత ధనవంతుడైన వెంకటేశ్వరుడి ప్రసాదం కల్తీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగినట్లు జులై 23న రిపోర్ట్ వస్తే చంద్రబాబు ఇంతకాలం ఎందుకు దాచారని నిలదీశారు. వైసీసీ పాలనలోనే కల్తీ జరిగిందని.. ఈ ఇష్యూపై దర్యాప్తు చేయమని అడిగే హక్కు వాళ్లకు లేదని అన్నారు.