జగిత్యాల జిల్లాలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 194 రోజుకు చేరుకుంది. ప్రస్తుతం కోరుట్ల నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఇబ్రహీంపట్నం మండలం గోదూరు నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర కొనసాగుతోంది. మెట్పల్లి మండల పరిధిలోని సింగాపూర్, మెట్ పల్లి, ఆరేపల్లి, మూర్తినగర్ మీదుగా కోరుట్ల పట్టణానికి చేరుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు కోరుట్ల బస్టాండ్ వద్ద బహిరంగ సభలో వైఎస్ షర్మిల పాల్గొని ప్రసంగించనున్నారు. సభ అనంతరం ఏకిన్ పూర్ మీదుగా పాదయాత్ర కొనసాగనుంది.
శనివారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేట్ గ్రామం నుండి హుస్సేన్ నగర్, ముత్యంపేట్ మీదుగా యాత్ర నిర్వహించారు. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ ముందు మహాధర్నా చేపట్టారు. ఇబ్రహీంపట్నం మండలం గోధూర్లో మాట ముచ్చట కార్యక్రమంలో గ్రామస్తులతో చర్చించి సమస్యలను తెలుసుకున్నారు. వైఎస్సార్టీపీ అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయిస్తామని షర్మిల హామీనిచ్చారు.