మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్కు పరిపాలన చేతకాదని, సీఎం పదవికి ఆయన అనర్హుడని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె పాదయాత్ర మంగళవారం 151వ రోజుకు చేరుకుంది. యాత్ర ఉదయం అడ్డాకుల నుంచి ప్రారంభమై దుబ్బపల్లి స్టేజ్, పొన్నకల్ క్రాస్ రోడ్, చెన్నంపల్లి, దాసరిపల్లి, వేముల, తుంకిపూర్, మూసాపేట మీదుగా సాయంత్రానికి జానంపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా జానంపేటలో నిర్వహించిన ‘మాట-ముచ్చట’ లో ఆమె మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో వ్యవసాయానికి గౌరవం లేదని, పండించిన పంటలకు మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే, రైతులకు పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -బంగారు తెలంగాణ అని చెప్పి, రాష్ట్రాన్ని కేసీఆర్ బార్ల తెలంగాణ, బీర్ల తెలంగాణగా మార్చారని విమర్శించారు. బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్అవినీతిని ప్రశ్నించడం లేదన్నారు. పాలమూరుకు వైఎస్సార్ హయాంలో లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారని, ఇప్పుడు కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు.