పాలేరు గడ్డ.. వైఎస్సార్​ బిడ్డ అడ్డా

  • ప్రజాప్రస్థానం పాదయాత్రను ఇక్కడే ముగిస్త: షర్మిల

ఖమ్మం రూరల్, వెలుగు: పాలేరు గడ్డ వైఎస్సార్ బిడ్డ అడ్డా అని, త్వరలోనే నియోజకవర్గంలోని ప్రతి గడపకూ వెళ్లి ప్రజలను కలుస్తానని వైఎస్సార్​ టీపీ చీఫ్​ షర్మిల అన్నారు. వైఎస్సార్​ 74వ జయంతి సందర్భంగా ఖమ్మం రూరల్​ మండలం కరుణగిరిలో వైఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 3,800  కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, త్వరలోనే మరో విడత ప్రజాప్రస్థానం ప్రారంభిస్తానని చెప్పారు. నాలుగు వేల కిలోమీటర్ల మైలురాయిని పాలేరు నియోజకవర్గంలోనే పూర్తి చేసి ముగింపు సభను ఏర్పాటు చేస్తానని చెప్పారు. 

తన గుండెలో నిజాయితీ ఉందని, పాలేరులో గడపగడపకూ వైఎస్​ సంక్షేమ పాలనను అందిస్తానన్నారు. పాలేరు ప్రజలకు అన్నివిధాలా అండగా ఉంటానన్నారు. వైఎస్సార్​ అన్ని వర్గాల ప్రజలకు సేవ చేశారని, ఆయన బిడ్డగా తనను దీవించాలని కోరారు.  కార్యక్రమంలో పార్టీ నాయకులు రామసాయం నరేష్​రెడ్డి, గడిపల్లి కవిత తదితరులు పాల్గొన్నారు.