వైఎస్సార్ పాలన తెస్త
కరుణగిరిలో పార్టీ ఆఫీస్‌కు భూమి పూజ
ఖమ్మం/ ఖమ్మం రూరల్, వెలుగు : తాను పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని.. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనను తీసుకొస్తానని వైఎస్సార్ టీపీ చీఫ్షర్మిల అన్నారు. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరిలో పార్టీ పాలేరు సెగ్మెంట్ ఆఫీస్‌కు విజయమ్మతో కలిసి శుక్రవారం ఆమె భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. గడపగడపకూ వైఎస్సార్ సంక్షేమ పాలనను అందిస్తానని, ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌దేనని, ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, పేదలకు ఇండ్లు ఇచ్చిన నాయకుడు ఆయనేనని గుర్తుచేశారు. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న ఐదేండ్లలో ఒక్క పాలేరు సెగ్మెంట్లోనే 20 వేల మంది కుటుంబాలకు ఇండ్లు ఇచ్చారని చెప్పారు. కానీ, కేసీఆర్ సర్కారు సంక్షేమ పథకాలను సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. విజయమ్మ మాట్లాడుతూ.. షర్మిల పార్టీ పెట్టి 16 నెలలే అయినా అనేక పోరాటాలు చేసిందని, ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు సృష్టించినా ప్రజల కోసం ముందుకెళ్తోందన్నారు. పాలేరు నుంచి పోటీ చేసి వైఎస్సార్ పాలనను మళ్లీ తెస్తుందని, పాలేరే తెలంగాణను పాలించే ఊరు కాబోతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గడిపల్లి కవిత, జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్, కృష్ణమోహన్ పాల్గొన్నారు.
తరలివచ్చిన అభిమానులు
పాలేరులో పార్టీ ఆఫీస్‌కు భూమి పూజ చేసేందుకు షర్మిల, విజయమ్మ రాగా.. ఆ సెగ్మెంట్లోని కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. షర్మిలకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత సర్వమత ప్రార్థనలు చేశారు.