నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. బార్లు, బీర్ల తెలంగాణగా మార్చారని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో రైతులు చస్తుంటే పట్టించుకోని కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో రైతులకు పైసలు పంచుతున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. అదంతా ఎవరి డబ్బో చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబమంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటోందని మండిపడ్డారు. బుధవారం పాదయాత్రలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ‘‘వైఎస్సార్ బతికుంటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేది. కేసీఆర్ పాలమూరును పట్టించుకోవడం లేదు. కాళేశ్వరంలో కమీషన్లు వస్తాయనే దాన్ని పూర్తి చేస్తున్నారు. పాలమూరులో కమీషన్లు రావనే పూర్తి చేస్తలేరు” అని అన్నారు. ‘‘ఎనిమిదేండ్లయినా వట్టెం రిజర్వాయర్ ను పూర్తి చేయలేదు. రిజర్వాయర్ కోసం తీసుకున్న భూములకు పరిహారం కూడా ఇవ్వలేదు. పునరావాసం కల్పించలేదు. ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా?’’ అని ప్రశ్నించారు.
దళితుల భూములు లాక్కుంటరా?
జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి దళితుల భూములు గుంజుకోవడం దుర్మార్గమని షర్మిల మండిపడ్డారు. ‘‘దళితులను రోడ్డున పడేసి దళిత బంధు ఇస్తం, ఉద్యోగాలు ఇస్తం అని అంటున్నారు. భూములు కోల్పోయినోళ్లు తిరగవడ్తే స్టేషన్లలో పెట్టి కొట్టిస్తున్నారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి. ఆయన దురంహకారానికి ఇదే నిదర్శనం” అని ఫైర్ అయ్యారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, లాయర్లను నడిరోడ్డు మీద నరికి చంపినా అడిగే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఫెయిలై మహిళలు చనిపోయినా ఆరోగ్య శాఖ మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.