తెలంగాణలో షర్మిల పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం ఇది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో తెలంగాణలోనూ కొన్ని చోట్ల పోటీ చేసి గెలిచినప్పటికీ వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆ తర్వాత ఏపీకే పరిమితమయ్యారు. తెలంగాణ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు సడన్‌గా ఆయన చెల్లెలు షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారంతో అటు వైసీపీ, ఇటు టీఆర్‌ఎస్ సహా రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఆమె పొలిటికల్ ఎంట్రీతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఆమె జగన్ ప్రోత్సాహంతో వస్తున్నారా లేక ఆయనతో విభేదించి వస్తున్నారా అని పార్టీలన్నీ లెక్కలు వేసేసుకుంటున్నాయి.
మన దేశ రాజకీయాల్లో కొత్త పార్టీల రాక అనేది పెద్ద విషయమేమీ కాదు. యాక్టివ్‌గా పొలిటికల్ తెరపై కనిపించే పార్టీలు కొన్నే అయినప్పటికీ.. ఈసీ దగ్గర రిజిస్టర్ అయ్యి.. ఆ తర్వాత నాలుగు రోజులు హడావుడి చేసి కనిపించకుండా పోయిన పార్టీలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోందన్న ప్రచారం కొద్ది రోజులుగా జోరందుకుంది. దీనిపై ఎక్కువగా చర్చ జరగడానికి ఏకైక కారణం.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో రెండు టర్మ్స్‌గా క్లోజ్‌గా ఉంటూ వస్తున్న ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఆమె చెల్లెలు కావడమే. ఆమె పొలిటికల్ ఎంట్రీతో రెండు రాష్ట్రాలు మధ్య సంబంధాలు, పార్టీల మధ్య బంధాలు, వేర్వేరు పార్టీలపై ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై చర్చ నడుస్తోంది.
స్ట్రాటజిక్‌గానే దూరం పెట్టిన జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ చెల్లెలిగా షర్మిల గతంలో ఏపీ పాలిటిక్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆమె ప్రచారం కూడా వైసీపీకి కలిసొచ్చింది. అయితే 2019లో జగన్ ఏపీలో సీఎం అయ్యాక షర్మిలను రాజకీయాలకు పూర్తిగా దూరం పెట్టారు. ఈ పని ఆయన కచ్చితంగా ఆలోచించి, స్ట్రాటజిక్‌గానే చేశారనడంలో అనుమానం లేదు. పవర్‌లోకి వచ్చాక తన చుట్టూ కుటుంబసభ్యులెవరూ లేకుండా జాగ్రత్త పడ్డారు. వాళ్లకు పదవులు ఇచ్చినా, ప్రభుత్వంలో ఇంపార్టెంట్ రోల్ ఇచ్చినా కుటుంబ పాలన అంటూ జనాల్లో ఏవగింపు వచ్చే చాన్స్ ఉంది. తండ్రి మరణించాక దాదాపు పదేండ్లు కష్టపడి పవర్‌లోకి వచ్చిన జగన్.. వారసత్వ రాజకీయాలను అసహ్యించుకునే, తప్పుబట్టే పార్టీలు, ప్రజలు ఈ విషయంలో ఆయన్ని ద్వేషించకుండా జాగ్రత్త పడ్డారు. రాజకీయాల పరంగా షర్మిలను దూరం పెట్టి ఆయన సరైన నిర్ణయమే తీసుకున్నారని చెప్పొచ్చు. కాంగ్రెస్‌ను ఒక ఉదాహరణగా చూస్తే ప్రియాంక గాంధీని యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చిన తర్వాత ఆ పార్టీకి ఒరిగిందేమీ లేదు. పార్టీలో మరో పవర్ సెంటర్ క్రియేట్ అవడం, నేతల్లో భిన్నాభిప్రాయాలు రావడం, ఇతర పార్టీల నుంచి విమర్శలు రావడం ఒక రకంగా మైనస్ అనే చెప్పాలి.
అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్రంలో చాలా మార్పులు
2014 తర్వాత తెలంగాణ రాజకీయాల నుంచి జగన్ పూర్తిగా దూరం జరిగారు. ఈ ఏడేండ్ల కాలంలో రాష్ట్రంలో వేర్వేరు లోకల్ బాడీ ఎలక్షన్స్, రెండేసి సార్లు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. అయితే 2014 నాటికీ, నేటికీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చాలా మారాయి. అప్పుడే కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ట్రంలో ఉద్యమ పార్టీ నాయకుడిగా కేసీఆర్‌కు ప్రజల నుంచి తిరుగులేని మద్దతు దక్కింది. ఇప్పుడు ఆయన పాలన, విధానాలపై చాలా వ్యతిరేకత పెరిగింది. చిన్న రాష్ట్రమైనప్పటికీ వేర్వేరు పార్టీలకు స్పేస్ కనిపిస్తోంది.
కొత్త పార్టీల రాక మంచిదే
ప్రజాస్వామ్యం కొత్త పార్టీలు వచ్చినప్పుడే ప్రజలకు మరింత మంచి జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. కేరళలో 25 పార్టీలు, తమిళనాడులో 15 పార్టీలు యాక్టివ్‌గా ఉన్నాయి. కేవలం పెద్ద పార్టీలే ఉంటే ప్రజల అభిప్రాయాలను తొక్కి పెట్టి పాలకులు నియంతృత్వ ధోరణితో వెళ్లే అవకాశం ఉంది. వాళ్ల ఒపీనియన్ బయటకు రావాలంటే చిన్నాచితకా పార్టీలు కచ్చితంగా ఉండాల్సిందే. పైగా షర్మిలకు రాజకీయంగా గడ్డు పరిస్థితులను నేరుగా చూసిన అనుభవం ఉంది.
రాజకీయాల్లో అధికారమే ప్రయారిటీ
అసలు జగన్ ఫ్యామిలీలో ఇంటర్నల్‌గా ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. షర్మిలను జగన్ కావాలనే రాజకీయాలకు దూరం పెట్టారన్నది మాత్రం ఓపెన్‌గా అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో జనాకర్షణ ఉన్న నేతగా పాపులర్ అయిన ఆమె అయిష్టంగానే అన్న మాటను వింటూ వచ్చి ఉంటారు. షర్మిల ఇప్పుడు మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ కావడానికి తెలంగాణను ఎంచుకోవడం కూడా సడన్‌గా జరిగిందేం కాదు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమె కూడా పార్టీ, ప్రభుత్వంలో యాక్టివ్‌గా ఉండాలని కోరుకునే ఉంటారు. కానీ మరో పవర్ సెంటర్ రావడం ఇష్టం లేకనో లేక ఇతర విషయాలను ఆలోచించో జగన్ ఆమెను దూరంగా ఉంచారు. షర్మిల ఏపీలో పార్టీ పెడితే జగన్‌కు మరింత ఇబ్బందికరంగా మారేది. అయితే తెలంగాణలో షర్మిల సక్సెస్ అయినా కాకున్నా, జగన్ ఆమెను ప్రోత్సహించినా, లేకున్నా చివరికి ఆమె పొలిటికల్ ఎంట్రీ మాత్రం జగన్‌కు ఇబ్బందికరమే. రాజకీయాల్లో కుటుంబాలు, బంధుత్వాలు, ఫ్రెండ్‌షిప్ కన్నా అధికారమే ప్రయారిటీ అన్నది అందరికీ తెలిసిందే. గతంలో ఎన్నో పొలిటికల్ ఫ్యామిలీల్లో చీలికలు రావడం చూశాం. షర్మిల రాజకీయం ఎలా ఉండబోతోందన్నది జగన్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఈ ఇష్యూ పెద్దది కాకముందే సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఈ సున్నితమైన సమస్యను పరిష్కరించడం అంత ఈజీ మాత్రం కాదు.
టీఆర్ఎస్, కాంగ్రెస్‌కూ నష్టమే
షర్మిల పొలిటికల్ ఎంట్రీతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కచ్చితంగా నష్టమే. ఆమె రాకతో రాష్ట్రంలోని రెడ్లలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే చాన్స్ ఉంది. దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ను అభిమానించే వాళ్లు ఈ రెండు పార్టీల్లోనూ ఉన్నారు. వాళ్లలో కొంత మంది ఆమె పార్టీ వైపు వెళ్లే చాన్స్ ఉంది. పైగా షర్మిల పార్టీ వెనుక జగన్ ఉన్నారా లేదా అన్న క్లారిటీ లేక కేసీఆర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి రావొచ్చు. ఇప్పటికే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందేం లేదని, రైతులు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని అనడం ద్వారా ఆమె ఇన్‌డైరెక్ట్‌గా కేసీఆర్‌ను విమర్శించారు. ఇయ్యాల్నో, రేపో కేసీఆర్ కూడా అటాకింగ్‌కు దిగుతారు. షర్మిల నుంచి దూరం జరగకుంటే జగన్‌పైనా కేసీఆర్ విమర్శలు గుప్పించక తప్పని పరిస్థితి వస్తుంది. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సరైన నాయకత్వం లేని కారణంగా వీక్ అయిపోయింది. దీంతో షర్మిల పార్టీలో చేరితే భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో సీనియర్ నేతలు అటు వెళ్లిపోతే ఏపీలో మాదిరిగా ఇక్కడ కూడా కాంగ్రెస్ ఖాళీ అవుతుంది.
బీజేపీ సహా ఇతర పార్టీలకు ఫరక్ లేదు
షర్మిల పొలిటికల్‌గా యాక్టివ్ అయినా ఏ మాత్రం ఫరక్ లేని పార్టీ బీజేపీ. పార్టీకి ఉన్న కార్యకర్తల బేస్ అంతా ఇతర పార్టీలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. జాతీయ వాదం, సిద్ధాంతపరమైన బలం కారణంగా బీజేపీకి ఏ నష్టం జరగదు. ఇక టీడీపీ, జనసేన షర్మిల రాకతో హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఆమె ఎంట్రీ వల్ల జగన్‌కు నష్టమేనని ఆ పార్టీల ధీమా. ఆమె ఏ చిన్న పొరపాటు చేసినా జగన్‌పై అటాక్‌కు దిగేందుకు ఈ రెండు పార్టీలకు చాన్స్ దొరుకుతుంది.
జగన్‌కు దెబ్బే
షర్మిల పార్టీ పెట్టి తెలంగాణలో యాక్టివ్‌గా మారితే ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కచ్చితంగా నష్టమనే చెప్పొచ్చు. కేసీఆర్‌తో ఫ్రెండ్లీగా ఉన్న ఆయనకు రాబోయే రోజుల్లో షర్మిల తీసుకునే నిర్ణయాల వల్ల విభేదాలు వస్తాయి. కొత్తగా వచ్చే ఏ పార్టీ అయినా అధికార పార్టీని విమర్శించక తప్పదు. దీని వల్ల ఆమె టీఆర్‌ఎస్‌పై కామెంట్ చేసిన ప్రతిసారీ కేసీఆర్ దానికి జగన్‌ను తప్పుబట్టే చాన్స్ ఉంది. ఇంకా రాజకీయ పరంగానూ జగన్‌కు అనేక ఇబ్బందులు రావొచ్చు. అందుకే షర్మిల పార్టీ పెడతారనే ప్రచారం మొదలవగానే దీనితో తమకు సంబంధం లేదని వైసీపీ ప్రకటించింది. ప్రస్తుతం జగన్, షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా ఆ భిన్నాభిప్రాయాలే విభేదాలకు దారి తీసే చాన్స్ ఉంది. – పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్