
ఈ ఏడాది శ్రీకారం, మహాసముద్రం సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వానంద్.. న్యూ ఇయర్‌లో ‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో వస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకుడు. తెలుగు వెర్షన్‌కి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశాడు. టైమ్ మెషీన్ బ్యాక్‌డ్రాప్‌లో మదర్ సెంటిమెంట్ స్టోరీతో రూపొందిన ఈ మూవీ టీజర్‌ను నిన్న లాంచ్ చేశారు. శర్వానంద్ మాట్లాడుతూ ‘నేను లైఫ్ లాంగ్ గర్వంగా చెప్పుకోదగిన సినిమా ఇది. దీనికి సోల్ ఫ్యాక్టర్ అమ్మ. ఆ పాత్రను అమల గారు చేస్తానంటేనే నేను నటిస్తానని చెప్పాను. అమ్మ పాటను తొమ్మిది నెలల పాటు రాశారు సిరివెన్నెల. ఆయనకు ట్రిబ్యూట్‌గా త్వరలోనే ఓ ఈవెంట్ పెట్టి సాంగ్‌ను రిలీజ్ చేస్తాం’ అని చెప్పాడు.
అమల మాట్లాడుతూ ‘స్టోరీ వినగానే కచ్చితంగా చేసి తీరాలని ఫిక్సయ్యాను. ఇకపై సినిమాలు చేయకపోయినా పర్లేదనిపించేంత మంచి పాత్ర. టాలెంటెడ్ టీమ్ వర్క్ చేశారు. అందరికీ నచ్చుతుంది’ అని చెప్పారు. ‘మా అమ్మను మిస్సయ్యాక.. తనను మళ్లీ చూస్తే ఎలా ఉంటుందని ఒక సీన్ రాశాను. ఆ ఒక్క సీనే ఈ సినిమాగా మారింది. స్ట్రాంగ్ ఎమోషన్‌తో పాటు ఫన్ ఉంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి నవ్విస్తారు. నాజర్ కీలక పాత్ర పోషించారు. అందరినీ నైన్టీస్‌కి తీసుకెళ్లే సినిమా’ అన్నాడు దర్శకుడు. ‘కొన్ని సినిమాలు మన భుజం తట్టి మోటివేట్ చేస్తుంటాయి. అలాంటి సినిమా ఇది. ప్రతి లైన్‌లో దర్శకుడి డెడికేషన్, మోటివేషన్ ఉంది’ అని చెప్పాడు తరుణ్ భాస్కర్. నిర్మాత ఎస్‌ఆర్ ప్రభు, మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్, డీఓపీ సుజీత్, ఎడిటర్ శ్రీజిత్, ఆర్ట్ డైరెక్టర్ సతీష్ కూడా పాల్గొన్నారు.