
శర్వానంద్, కృతిశెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మనమే’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈరోజు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన దర్శకులు మారుతి, కిశోర్ తిరుమల, శివ నిర్వాణ, సాయి రాజేష్ సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు.
శర్వానంద్ మాట్లాడుతూ ‘మనిషి మనిషికి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ టైమ్. ఇలాంటి మంచి పాయింట్ ఉన్న చిత్రమే ఇది. నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. ఎంటర్‌టైన్ చేస్తూనే మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇక రీసెంట్‌గా ఎన్నికల వాతావరణం ముగిసింది. ఈరోజు నుంచి ‘మనమే’ చిత్రంతో మరో పండగ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత జూన్ 27న ‘కల్కి’తో మరో పండుగ వాతావరణం.
ఇక నుంచి అన్ని మంచి రోజులే’ అని చెప్పాడు. ఇదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని కృతి శెట్టి చెప్పింది. శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకు పెద్ద డ్రీమ్. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. ఈ చిత్రాన్ని పేరెంట్స్‌తో చూస్తే గొప్ప ఎక్స్‌పీరియెన్స్, ఎనర్జీని ఫీల్ అవుతారు’ అని చెప్పాడు. శర్వానంద్‌కి ఈ చిత్రంతో ‘చార్మింగ్ స్టార్’ అనే టైటిల్ ఇస్తున్నామని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ అన్నారు. కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృతి ప్రసాద్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.