మయోనైస్ కలిపిన షవర్మాను సేవించి 17 మంది అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని షవర్మా సెంటర్ ను మూసివేశారు. అల్వాల్‌లోని గ్రిల్ హౌస్‌లో షావర్మా సేవించిన తర్వాత బాధితులకు వాంతులు, విరేచనాలు లాంటి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వంటి లక్షణాలు కనిపించాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) బాధితుల రక్త పరీక్షలలో హానికరమైన సాల్మొనెల్లా బ్యాక్టీరియాను కనుగొన్నట్టు ధృవీకరించింది.
ఆహారం కలుషితం కావడమే బాధితుల అస్వస్థతకు కారణమని జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ధారించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఎఫ్‌ఎస్‌ఓ) లక్ష్మీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని షవర్మా జాయింట్‌పై ఈ చర్య తీసుకున్నారు. అనంతరం ఐపీసీలోని 273, 269 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి గ్రిల్ హౌస్ మేనేజర్ తౌఫిక్‌ను అరెస్టు చేశారు.
షావర్మాకు ఉపయోగించే మయోనైస్ ను గుడ్డులోని పచ్చసొన, నిమ్మరసం, మంచి నూనెతో తయారు చేస్తారు. దాన్నే షావర్మా జాయింట్లకు రాస్తారు. కొన్ని ఫుడ్ కోర్టుల్లో.. షావర్మాకు ఉపయోగించే మయానైస్ ను కల్తీ పదార్థాలతో తయారు చేస్తున్నారు. కల్తీ నూనె వాడుతున్నారు. కుళ్లిపోయిన నిమ్మకాయల నుంచి వచ్చిన రసం వాడుతున్నారు. ఇలాంటి షావర్మా తినటం వల్లే 17 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలోనే గ్రిల్ హౌస్ రెస్టారెంట్ ను మూసివేశారు హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు.