భారత క్రికెట్ పరువు తీసింది.. మహిళా కెప్టెన్‌పై వరల్డ్ కప్ హీరో ఆగ్రహం

భారత క్రికెట్ పరువు తీసింది.. మహిళా కెప్టెన్‌పై వరల్డ్ కప్ హీరో ఆగ్రహం

బంగ్లా పర్యటనలో భారత మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టడం, అంపైర్‌ను దూషించటం పక్కనపెడితే.. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో బంగ్లా మహిళా క్రికెటర్లతో ఆమె నడుచుకున్న తీరుపై స్వదేశంలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. 

మీరు కాదు.. అంపైర్లను పిలవండి

ఔట్ ఇచ్చాడన్న కోపంలో బ్యాట్‌తో వికెట్లను పడగొట్టిన హర్మన్‌ప్రీత్.. అంపైర్‌ను ధూషిస్తూనే పెవిలియన్ చేరింది. ఈ గొడవ అంతటితో ఆగిందా! అంటే అదీ లేదు. మూడు మ్యాచుల వన్డే సిరీస్ 1-1 తేడాతో సమం కావడంతో కప్ అందుకోవడానికి వచ్చిన బంగ్లా కెప్టెన్‌పైనా నోరుపారేసుకుంది. చివరి వన్డే టై కావడాన్ని ఉద్దేశిస్తూ.. ""మీరు ఒక్కరే ఇక్కడ ఎందుకున్నారు. మ్యాచ్ మీ వల్ల టై అవ్వలేదు. అంపైర్లు చేశారు. వారిని పిలవండి.. వారితోనూ కలిసి ఫోటోలు దిగుతాం.." అంటూ హేళన చేసింది. ఈ మాటలను అవమానంగా భావించిన బంగ్లా మహిళా క్రికెటర్లు తల దించుకొని డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయారు. ఈ మాటలను అవమానంగా భావించిన బంగ్లా మహిళా క్రికెటర్లు తల దించుకొని డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయారు.

ఈ ప్రవర్తనను భారత మాజీ క్రికెటర్లు కూడా తప్పుబడుతున్నారు. హర్మన్‌ప్రీత్‌ వల్ల భారత క్రికెట్‌కు చెడ్డ పేరు వచ్చిందని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు మదన్ లాల్ బీసీసీఐకి సూచించారు." బంగ్లా మహిళల జట్టుపై హర్మన్‌ప్రీత్ ప్రవర్తన క్షమించరానిది. ఆమె క్రికెట్ కంటే పెద్దది కాదు. హర్మన్‌ప్రీత్ వల్ల భారత క్రికెట్‌కు చెడ్డ పేరొచ్చింది. బీసీసీఐ ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.." అని మదన్ లాల్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 

గెలవాల్సిన మ్యాచ్ టై

ఢాకా వేదికగా శనివారం భార‌త్, బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య నిర్ణయాత్మక మూడో వ‌న్డే టైగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 225 పరుగులు చేయగా.. లక్ష్య చేధనలో భారత్ సరిగ్గా 225 పరుగులకు ఆలౌటైంది. విజయానికి ఒక పరుగు అవసరమైన సమయంలో.. హర్మన్‌ప్రీత్‌ సేన చివరి వికెట్ కోల్పోయింది. అనంతరం వర్షం కారణంగా అంపైర్లు ‘సూపర్ ఓవర్’ నిర్వహించకుండానే ఇరు జట్లను సంయుక్త విజేత‌లుగా ప్ర‌క‌టించారు.

ఈ మ్యాచ్‌లో అంపైర్లు బంగ్లా జట్టుకు అనుకూలంగా వవహరించన్నది హర్మన్‌ప్రీత్ఆరోపణ. కాగా, భారత మహిళా కెప్టెన్ తీరుపై ఐసీసీ ఇప్పటికే చర్యలు తీసుకుంది. మ్యాచ్‌ ఫీజులో 75 శాతం జరిమానాతో పాటు 3 డిమెరిట్ పాయింట్లు విధించింది. అయితే అందుకు సంబంధించిన ఐసీసీ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.