
- ఇద్దరు పిల్లలను కత్తితో నరికి తల్లి ఆత్మహత్య
- హైదరాబాద్‌లోని గాజులరామారంలో ఘటన
- అనారోగ్య సమస్యలతోనే ఈ దారుణానికి తెగించినట్లు సూసైడ్ నోట్
జీడిమెట్ల, వెలుగు: ఇద్దరు పిల్లలను కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపి ఆ తర్వాత బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని గాజులరామారంలో జరిగింది. తన పిల్లలు, తాను అనారోగ్యంతో బాధపడుతున్నామని.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ తల్లి రాసిన ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి, తేజస్విని(35) దంపతులకు హర్షిత్ (11), ఆశీష్ (7) అనే ఇద్దరు కుమారులు. ఈ కుటుంబం నాలుగేండ్ల కింద జీవనోపాధికోసం హైదరాబాద్‌కు వచ్చింది. గాజులరామారం బాలాజీ లే అవుట్‌లోని సహస్ర మహేశ్ హైట్స్అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వెంకటేశ్వర్‌రెడ్డి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు.
గురువారం వెంకటేశ్వర్‌రెడ్డి డ్యూటీ వెళ్లగా.. సాయంత్రం 4 గంటలకు తేజస్విని తన ఇద్దరు పిల్లలను కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపింది. తర్వాత అపార్ట్మెంట్ఆరో అంతస్తుపైకి వెళ్లి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. పెద్ద కుమారుడు హర్షిత్ అక్కడికక్కడే చనిపోగా.. చిన్న కొడుకు అశీష్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
పిల్లలకు కంటి సమస్య.. తల్లికి మానసిక సమస్య!
సంఘటనాస్థలంలో పోలీసులకు సూసైడ్‌నోట్ లభించింది. దాని ఆధారంగా స్థానికులను విచారించారు. ప్రాథమిక విచారణలో తేజస్విని మానసిక పరిస్థితి సరిగా లేదని, తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని చెప్పారు. తేజస్వినితోపాటు ఇద్దరు పిల్లలకు కంటి సమస్యలున్నాయని.. పిల్లలకు ప్రతి రెండు, మూడు గంటలకోసారి కండ్లలో డ్రాప్స్ వేస్తే గానీ వారికి సరిగ్గా కనబడదన్నారు.
ఆమెకు అనారోగ్య సమస్యలు , పిల్లలకు కంటి సమస్యలు ఉండడంతో మరింత డిప్రెషన్లోకి వెళ్లిందని చెప్పారు. ఈ డిప్రెషన్లోనే బిడ్డలను నరికి చంపి తానూ ఆత్మహత్య చేసుకుందని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.