Vinesh Phogat: తీవ్ర దుఃఖంలో వినేష్ ఫోగాట్.. పరామర్శించిన పీటీ ఉష

Vinesh Phogat: తీవ్ర దుఃఖంలో వినేష్ ఫోగాట్.. పరామర్శించిన పీటీ ఉష

ఒకవైపు అనర్హత వేటు పడి ఒలింపిక్స్‌ పతకమూ చేజారె.. మరోవైపు, బరువు తగ్గడం కోసం రాత్రంతా కఠిన వ్యాయామాలు చేయడం ద్వారా అనారోగ్యమూ ధరిచేరే.. పారిస్ గడ్డపై భారత్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ వేదన మాటల్లో వర్ణించలేనిది. చెప్పడానికి, సానుభూతి వ్యక్తం చేయడానికి ఎంతో మంది ముందుకొస్తున్నా.. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. డీ హైడ్రేషన్ వల్ల ఆస్పత్రి పాలై చికిత్స పొందుతోన్న ఆమెను.. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష పరామర్శించారు. 

పీటీ ఉష పారిస్‌లోని ఒలింపిక్ విలేజ్ మెడికల్ సెంటర్‌లో వినేష్‌ ఫోగాట్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భారత రెజ్లర్ శారీరకంగా, వైద్యపరంగా బాగానే ఉన్నారని తెలిపారు. అయితే, తనపై అనర్హత వేటు పడ్డాక వినేష్ ఫోగాట్ నిరాశలో కూరుకుపోయారని వెల్లడించారు. మానసికంగా ఆమె కోలుకునేందుకు సమయం పడుతుందని అన్నారు.

భారత సహాయక సిబ్బంది వినేష్ వెంట ఉన్నారని, ఆమె బరువు తగ్గించేందుకు ఆమెతో కలిసి పనిచేస్తున్నారని ఐఓఏ ప్రెసిడెంట్ అన్నారు. వారు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు) చీఫ్ నెనాద్ లాలోవిచ్‌ను కలవబోతున్నట్లు తెలిపిన ఉష.. తాను చేయగలిగినంత చేస్తానని చెప్పుకొచ్చారు.

పతకం ఇవ్వడం అసాధ్యం

కాగా, వినేశ్‌ ఫోగాట్‌పై పడిన అనర్హత వేటు విషయంలో తానేమీ చేయలేనని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు) చీఫ్ నెనాద్ లాలోవిచ్ అన్నారు. నియమనిబంధనలు అందరికీ ఒకేలా ఉంటాయని, భారత రెజ్లర్‌కు రజత పతకాన్ని అందించడం అసాధ్యమని తెలిపాడు. అంతేకాదు, ఆమె లేకుండా పోటీ కొనసాగుతుందని అన్నారు.

మరోవైపు, అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో తలపడేందుకు క్యూబా రెజ్లర్ యుస్నీలిస్ గుజ్మాన్ లోపెజ్‌కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ ఇచ్చింది.