డ్రైవర్ బెహన్​: పట్టుబట్టి..స్టీరింగ్ పట్టి

డ్రైవర్ బెహన్​:  పట్టుబట్టి..స్టీరింగ్ పట్టి

‘అమ్మాయివి అవన్నీ నీకెందుకు?’ అన్నాడు తండ్రి. ‘లేదు నాన్నా.. అది నా కల’ అని చెప్పింది కూతురు. ఎప్పటికైనా తనకు పెద్ద పెద్ద వెహికల్స్​ నడపాలని కోరిక. ఆ కోరికతోనే ఇప్పుడు బస్​ డ్రైవర్​గా జాబ్​ చేస్తోంది. ఆమె ​ పేరు రీతూ నర్వల్​. రీతూ నర్వల్​కు 35 ఏండ్లు. టీనేజ్​లోనే తను లైఫ్​ గోల్ సెట్​ చేసుకుంది. అందరిలా చదువుకొని ఉద్యోగం చేయడం, డబ్బులు సంపాదించడం కాదు. డ్రైవర్​ అవ్వాలలి. భారీ వెహికల్స్​ నడిపి, పెద్ద పెద్ద రోడ్ల మీద స్టీరింగ్​ తిప్పాలని చిన్నప్పటి నుంచీ కలలు కన్నది. మహిళలకు చాలా తక్కువ అవకాశాలు ఉన్న ఫీల్డ్​ అది. తన ఆలోచన చెబితే మొదట తండ్రి వద్దన్నాడు. కానీ పట్టుబట్టింది. కొన్ని రోజులకు కూతురి మనసును అర్థం చేసుకున్నాడు తండ్రి. డ్రైవర్​ కావాలన్న ఆమె కలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చాడు. దీంతో రీతూ డ్రైవింగ్​ నేర్చుకుంది. బైక్​లు, కార్లు నడిపింది. కానీ అవన్నీ చిన్న చిన్న వెహికల్స్​. పెద్ద బండ్లు నడిపే ​ డ్రైవర్ కావాలన్నది ఆమె కోరిక. ఆ తర్వాత లారీలు, ట్రక్కులు నడిపింది. మొత్తానికి 28 ఏండ్లకు హెవీ మోటార్​ వెహికల్ లైసెన్స్​ తీసుకుంది. నేషనల్ హైవే మీద పెద్ద పెద్ద వెహికల్స్​ స్టీరింగ్​ తిప్పుతూ తన కలల ప్రయాణాన్ని సాకారం చేసుకుంది. విమెన్​ డ్రైవర్​గా మధ్యప్రదేశ్​లో పేరు తెచ్చుకుంది రీతూ. ఆమె గురించి తెలుసుకున్న ‘అటల్ ఇండోర్ సిటీ ట్రాన్స్‌‌పోర్ట్ సర్వీస్ లిమిటెడ్’ మహిళా డ్రైవర్లను ప్రోత్సహించాలని రీతూకి ఉద్యోగం ఇచ్చింది. ఇలా ప్రైవేట్​ ట్రాన్స్​పోర్ట్​​ నుంచి పబ్లిక్​ ట్రాన్స్ పోర్ట్​​లో ఉద్యోగం తెచ్చుకుంది. ఈ మధ్యే ఇండోర్​లో మొదటిసారిగా రాజీవ్ గాంధీ స్క్వేర్ నుంచి నిరంజన్‌‌పూర్ స్క్వేర్ మధ్య ప్యాసింజర్​ బస్సు నడిపి మధ్యప్రదేశ్​ ఫస్ట్​ విమెన్​ బస్​ డ్రైవర్​గా గుర్తింపు పొందింది. బస్సులో ఉన్న వాళ్లు డ్రైవర్​ సీటు వైపు చూసి లేడీ ​డ్రైవర్ ఉండటంతో సంతోషించారు. ‘డ్రైవర్​ బెహన్​’ అంటూ ఎంకరేజ్​ చేశారు.