భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో మహిళా పోలీస్స్టేషన్ జాడలేకుండా పోయింది. మహిళా పోలీస్స్టేషన్ కు బిల్డింగ్ మంజూరు చేసి నిధులు విడుదల చేసిన సర్కారు, స్టేషన్ ఏర్పాటును పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే మహిళా పోలీస్స్టేషన్ కోసం కట్టిన బిల్డింగ్లో త్రీ టౌన్ పోలీస్స్టేషన్ కొనసాగుతోంది. జిల్లాలో మహిళలకు సంబంధించిన కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రత్యేకంగా పోలీస్స్టేషన్ లేకపోవడంతో మహిళలకు సరైన న్యాయం దొరకడం లేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు షీ టీమ్ స్టేషన్ రేకుల షెడ్లో అరకొర సౌలతుల మధ్య నడుస్తోంది. జిల్లా కేంద్రంలో మహిళా పొలీస్ స్టేషన్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
కేసులు ఫుల్..
జిల్లాలోని 35 పోలీస్ స్టేషన్లలో ప్రతిరోజు మహిళల సమస్యలపై కేసులు నమోదవుతున్నాయి. 2020లో 262, 2021లో 356, 2022లో 343 వేధింపుల కేసులు నమోదయ్యాయి. మూడేండ్లలో 55 వరకట్న ప్రేరేపిత హత్యలు ఉన్నాయి. లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తనకు సంబంధించి 484 కేసులు, 157 అత్యాచారం కేసులు, 42 కిడ్నాప్ కేసులునమోదయ్యాయి. 2022లో 82 పోక్సో కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెంతో పాటు పాల్వంచ, ఇల్లందు, టేకులపల్లి, సుజాతనగర్, మణుగూరు తదితర ప్రాంతాల్లో మహిళల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. రెండేండ్ల కింద కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి గొల్లగూడెం వెళ్లే దారిలో మహిళా పోలీస్ స్టేషన్ బిల్డింగ్ నిర్మించారు. బిల్డింగ్నిర్మించినా స్టేషన్ మంజూరు చేయకపోవడంతో ఆ బిల్డింగ్లో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కొనసాగుతోంది. జిల్లాలో గృహహింస, వరకట్నం, అనుమానంతో భార్యలను చిత్రహింసలకు గురి చేయడం, శారీరక, లైంగిక వేధింపులు, స్నేహం ముసుగులో మానసిక వేధింపులు, భార్యభర్తల మధ్య లొల్లి వంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వీఐపీల బందోబస్తు, పెట్రోలింగ్, ట్రాఫిక్, గొడవలు, దొంగతనాలు, ఇతరత్రా వాటితో పోలీసులకు టైం సరిపోతోంది. మహిళలకు సంబంధించిన కేసుల విషయంలో పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేని పరిస్థితి ఉందని పలువురు పొలీస్ ఆఫీసర్లే చెబుతున్నారు. ఇదిలా ఉంటే షీ టీమ్ తో పాటు సఖి సెంటర్కు సరైన బిల్డింగ్ లేదు.
వెంటనే ఏర్పాటు చేయాలి
జిల్లాలో మహిళా పొలీస్స్టేషన్ ఏర్పాటు చేయాలి. మహిళా పోలీస్ స్టేషన్కు మహిళలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఏ సమయంలోనైనా నిర్భయంగా వచ్చే అవకాశం ఉండాలి. బిల్డింగ్ పూర్తయినా స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం సరైంది కాదు.
- కె రత్నకుమారి,
మహిళా సంఘం నాయకురాలు