ఆపరేషన్ మూసీలో ముందుగా షెడ్లు,గోదాములు కూల్చివేత..

మూసీ పరీవాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలు, కబ్జాల తొలగింపుపై అధికారులు ఫోకస్​  పెట్టారు. అక్కడి బస్తీలను ఖాళీ చేసే ప్రక్రియ ఎలా నిర్వహించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమ  నిర్మాణాల తొలగింపు సందర్భంగా స్థానికుల నుంచి వ్యతిరేకత రాకుండా.. ముందే వారికి సర్ధిచెప్పాలని నిర్ణయించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్  అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్​ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో.. అర్హులను ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

ఇందులో భాగంగా మంగళవారం మున్సిపల్​ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్​ సమక్షంలో రెవెన్యూ అధికారులు సెక్రటేరియెట్​లో ప్రత్యేక సమావేశమై చర్చించారు. హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ కలెక్టర్లతో పాటు హైడ్రా కమిషనర్​ రంగనాథ్​, జీహెచ్​ఎంసీ కమిషనర్​ ఆమ్రపాలి, మూసీ రివర్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ జాయింట్​ కమిషనర్​ గౌతమి  పాల్గొన్నారు.

Also Read:-తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం

ఇటు తూర్పున గౌరెల్లి నుంచి పశ్చిమాన నార్సింగి వద్ద ఓఆర్​ఆర్​ వరకూ 55 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన మూసీ నదిలో దాదాపు 13 వేల వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు అధికారుల సర్వేలో తేలింది. ఇందులో దాదాపు 4 వేల వరకు షెడ్లు, దుకాణాలు, గోదాములు, మెకానిక్​  షాపులు వంటివి ఉన్నాయని గుర్తించారు. ముందుగా షెడ్లు, దుకాణాలు, గోదాములు, మెకానిక్​ షాపులను తొలగించి.. బస్తీలు, కాలనీల్లోని వారికి ప్రత్యామ్నాయ చూపించిన తర్వాతే అక్రమ ఇండ్లను కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ విషయంలో హైదరాబాద్​ పరిధిలోని మూసీలో నిర్మాణాలు, నివాసాలను ఎలా తొలగించాలి?  నిర్వాసితులకు చేసే సాయం ఎలా ఉండాలన్న దానిపై  హైదరాబాద్​ కలెక్టర్​ అనుదీప్​ దురిశెట్టి బుధవారం రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.