రెండో విడతలో 250 యూనిట్లే.. జిల్లాలో ముందుకు సాగని గొర్రెల పంపిణీ స్కీమ్

  • సెకండ్ ఫేజ్​లో 4,138 యూనిట్లు పెండింగ్​ 
  • డీడీలు తీసి ఎదురుచూస్తున్న 2,239 మంది
  • ఫండ్స్ లేకనే పంపిణీ ఆలస్యమంటున్న ఆఫీసర్లు​

మంచిర్యాల, వెలుగు: గొల్ల కురుమల ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్​ ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని ప్రారంభించగా ఇప్పటికి ఆరేండ్లు కావస్తున్నా.. ఆశించిన ప్రగతి లేకపోవడంతో లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. అనేక అవాంతరాలు, అవినీతి, అక్రమాల నడుమ ఫస్ట్​ఫేజ్​ పూర్తయినా సెకండ్​ఫేజ్​మాత్రం ముందుకు సాగడం లేదు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా రెండో విడత గొర్రెల పంపిణీ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం, ఆపై ఆగిపోవడం పరిపాటిగా మారింది. 

నిరుడు మునుగోడు బై ఎలక్షన్​ సందర్భంగా సర్కారు మరోసారి హడావుడి చేసినప్పటికీ ఎన్నికల తర్వాత ఎదురుచూపులే మిగిలాయి. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎలక్షన్లు జరుగనున్న నేపథ్యంలో గొర్రెల పంపిణీని స్పీడప్​చేయాలని ఆదేశాలు వచ్చినప్పటికీ ఫండ్స్​ లేకపోవడం అధికారులు పరేషాన్​అవుతున్నారు. దీంతో రెండో విడతలో మంచిర్యాల జిల్లాలో కేవలం 250 యూనిట్లను మాత్రమే అందించారు.

ఫస్ట్​ ఫేజ్ లో 5,719 యూనిట్లు పంపిణీ..

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 183 గొర్రెల పెంపకందారుల సొసైటీలు ఉండగా, అందులో 11,500 మంది మెంబర్లు ఉన్నారు. ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ స్కీమ్​ను ప్రారంభించింది. జిల్లాలోని సభ్యులందరినీ లబ్ధిదారులుగా గుర్తించింది. అందరికీ ఒకేసారి పంపిణీ చేయడం కష్టం కావడంతో రెండు విడతల్లో పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని లబ్ధిదారుల పేర్లతో ఏ, బీ రెండు లిస్టులు తయారు చేసింది. ఫస్ట్​ లిస్టులో 5,833 మంది, సెకండ్​ లిస్టులో 5,786 మందిని ఎంపిక చేసింది. 2017–18లో ఫస్ట్​ లిస్టులో ఉన్న 5,719 మందికి గొర్రెలను అందజేశారు.   

సెకండ్  ఫేజ్​ కోసం ఎదురుచూపులు

బీ లిస్టులో ఉన్న లబ్ధిదారులు సెకండ్​ ఫేజ్​ గొర్రెల పంపిణీ కోసం ఆరేండ్ల నుంచి ఎదురుచూస్తూనే ఉన్నారు. 5,786 యూనిట్లకు గాను 2019–20లో 1,762 యూనిట్లను పంపిణీ చేయగా తర్వాత అర్ధంతరంగా ఆగిపోయింది. అనంతరం ప్రభుత్వం యూనిట్ కాస్ట్​ను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచింది. దీంతో లబ్ధిదారుల వాటా రూ.31,250 నుంచి రూ.43,750కి పెరిగింది. దీంతో లబ్ధిదారులు అదనంగా రూ.12,500 చెల్లించాల్సి వచ్చింది. ఇంకా 4,138 మందిలో 2,239 మంది పూర్తిస్థాయి వాటాధనం డీడీలు తీశారు. ఇప్పటివరకు వీరిలో 250 మందికి మాత్రమే గొర్రెల యూనిట్లను గ్రౌండింగ్​చేశారు.  

ఫండ్స్​రావట్లే.. గొర్రెలు దొరకట్లే..

గొర్రెల పంపిణీ స్కీమ్​ ఆగుతూ సాగడానికి ప్రధాన కారణం ఫండ్స్​ లేకపోవడమేనని తెలుస్తోంది. నిధుల కొరత వల్ల ప్రభుత్వం జిల్లాలకు దశలవారీగా ఫండ్స్​ కేటాయిస్తోంది. దీంతో ఆ మేరకే అధికారులు యూనిట్లు గ్రౌండింగ్​ చేస్తున్నారు. మంచిర్యాలకు ఏపీలోని కడప, ప్రకాశం జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని షోలాపూర్, కర్ణాటకలోని బల్లారి జిల్లాలను కేటాయించారు. ఆ సెంటర్లలో పశుసంవర్ధక శాఖ అధికారులను కోఆర్డినేటర్లుగా నియమించింది. ఒక్కో యూనిట్​లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు కలిపి మొత్తం 21 అందిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సరైన గొర్రెలు దొరకడం లేదని అధికారులు చెప్తున్నారు.  

దశలవారీగా  పంపిణీ చేస్తున్నాం..

జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. దశలవారీగా లబ్ధిదారులందరికీ అందజేస్తాం. 4,138 మంది లబ్ధిదారులకు గానూ 2,239 మంది మాత్రమే పూర్తిస్థాయిలో డీడీలు తీశారు. ఇప్పటివరకు 250 యూనిట్లను  గ్రౌండింగ్​ చేశాం. మిగతా వారితో డీడీలు తీయించి గొర్రెలు అందజేస్తాం.
రమేశ్, జిల్లా పశుసంవర్ధక అధికారి