గొర్రెలు కొనలేదు.. ఇవ్వలేదు..రికార్డుల్లో తప్ప లబ్ధిదారులకు చేరలేదు

గొర్రెలు కొనలేదు.. ఇవ్వలేదు..రికార్డుల్లో తప్ప లబ్ధిదారులకు చేరలేదు
  •     గొర్రెల పంపిణీ స్కామ్​లో 60 మందిని ప్రశ్నించిన ఏసీబీ
  •     స్థానిక వెటర్నరీ సిబ్బంది కమీషన్ల దందా
  •     రూ.700 కోట్ల స్కామర్స్‌‌‌‌పై దృష్టి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గొర్రెల పంపిణీ స్కీమ్‌‌‌‌ స్కామ్‌‌‌‌ గుట్టురట్టు అవుతున్నది. గొర్రెల కొనుగోళ్లు, పంపిణీ రికార్డుల్లో తప్ప లబ్ధిదారులకు చేరలేదని తేలింది. లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వకుండా స్థానిక వెటర్నరీ సిబ్బంది కమీషన్ల దందా చేసినట్లు వెల్లడైంది. ఈ స్కామ్‌‌‌‌లో పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ మాజీ ఎండీ సబావత్‌‌‌‌  రాంచందర్‌‌‌‌, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌‌‌‌ యాదవ్‌‌‌‌  ఓఎస్డీ కల్యాణ్‌‌‌‌ కుమార్‌‌‌‌  ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కమీషన్ల దందా నడిచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 

ఈ స్కామ్ లో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నాంపల్లి ఏసీబీ కోర్టులో సోమవారం కస్టడీ పిటిషన్ వేయనున్నారు. కోర్టు అనుమతితో నిందితులను కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. వారు వెల్లడించే వివరాల ఆధారంగా స్కామ్‌‌‌‌లో మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌  ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ  స్కీమ్‌‌‌‌లో రూ.2.10 కోట్ల గోల్‌‌‌‌మాల్‌‌‌‌పై డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో గచ్చిబౌలి పీఎస్‌‌‌‌లో నమోదైన కేసు ఆధారంగా ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది.18 మంది బాధిత రైతుల స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ను రికార్డు చేసింది. అలాగే 60 మందిని అధికారులు  విచారించారు. 

గొర్రెల పంపిణీ పథకంలో బిల్లు చెల్లింపుల విధానంలో ఉన్న లొసుగుల వల్లే అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ప్రయివేట్‌‌‌‌  ఏజెంట్లు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకుల అనుచరులు కుమ్మక్కై స్కీమ్ డబ్బులు గోల్‌‌‌‌మాల్‌‌‌‌  చేసినట్లు ఆధారాలు సేకరించారు. పది బినామీ అకౌంట్ల ద్వారా నిధులు కొల్లగొట్టినట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అధికారులను అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌కు తరలించారు. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ చక్రం తిప్పాడు

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌‌‌‌ యాదవ్  ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ఈ స్కామ్‌‌‌‌లో కీలక సూత్రధారి అని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. గొర్రెల స్కీమ్‌‌‌‌  ఆధారాలను మాయం చేసుందుకు అతను ప్రయత్నించడంపై ఇప్పటికే నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే కల్యాణ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌  ఆధారాలను సేకరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కాంట్రాక్టర్లు, ఏజెంట్లతో కమీషన్లకు తెరతీసినట్లు గుర్తించారు. ఏసీబీ దర్యాప్తులో రూ.700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆధారాలు లభించడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పది మంది అధికారులు అరెస్టు కాగా..   కాంట్రాక్టర్లు‌‌‌‌ మొహిదుద్దీన్, సయ్యద్‌‌‌‌ ఇక్రముద్దీన్‌‌‌‌  విదేశాలకు పారిపోయారు. వారిపై పోలీసులు లుక్‌‌‌‌ఔట్  సర్క్యులర్‌‌‌‌  ‌‌‌‌జారీ చేశారు.