లేని గొర్రెలకు 18 కోట్లు!

  •     ఆటోల నంబర్లు వేసి లారీల్లో తెచ్చినట్టు దొంగ బిల్లులు
  •     రవాణా చేసింది లేదు.. గొర్రెలు తెచ్చింది లేదు
  •     నల్గొండ జిల్లాలో అధికారులు, ఏపీ దళారులు కలిసి దందా
  •     అధికారుల ఆడిట్​లో బయటపడ్డ బాగోతం

నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీ స్కీంలో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. కొందరు అధికారులు, దళారులు కలిసి లేని గొర్రెల పేరిట రూ.18 కోట్లు స్వాహా చేసినట్లు తెలిసింది. ఆడిట్​ అధికారులు వారం రోజుల కింద జిల్లాలో  పశుసంవర్ధక శాఖలోని పాత ఫైళ్లను తనిఖీ చేయగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. పశుసంవర్ధక శాఖ ఎండీనే దీని వెనక అసలు సూత్రధారి అని జిల్లా అధికారులు చెప్తున్నారు. గొర్రెల పంపిణీ స్కీం ఫేజ్1 ట్రాన్స్​పోర్టు కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడితే, ఫేజ్2లో ఏకంగా రై తుల పేర్లతో దళారులు భారీ దోపిడీకి పాల్పడ్డారు.

అసెంబ్లీ ఎన్నికలను అదునుగా భావించి

అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెకండ్ ఫేజ్​లో నల్గొండ జిల్లాకు 5,696 గొర్రెల యూనిట్లు శాంక్షన్ చేశారు. పశు సంవర్ధక శాఖ గైడ్​లైన్స్ ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని గొర్రెలు ఉత్పత్తి చేసే రైతుల వద్ద గొర్రెలు కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. కానీ రూల్స్​కు వ్యతిరేకంగా దళారుల వద్ద కొన్నారు. అనంతపురం, బీదర్, ప్రకాశం జిల్లాల్లోని దళారుల వద్ద పెద్ద సంఖ్యలో గొర్రెలు కొనుగోలు చేయడంతో అనుమానం వచ్చిన అప్పటి జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ రూ.18 కోట్ల బిల్లులు ఆపేశారు. 

కానీ అప్పటి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు బిల్లులు క్లీయర్ చేయాలని ఆఫీసర్లపై ఒత్తిడి చేయడంతో అప్పుడున్న జిల్లా ఆఫీసర్ సెలవులో వెళ్లిపోయారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అప్పటి కొనుగోళ్ల పై విచారణకు ఆదేశించడంతో అక్రమాలు బయట పడుతున్నాయి.

రైతుల పేరుతో దళారుల దోపిడీ

జిల్లాకు ఫస్ట్ ఫేజ్​లో 26 వేల యూనిట్లు శాంక్షన్ చేయగా.. గొర్రెలు అమ్మేందు కు 5,350 మంది రైతులు ముందుకు వచ్చారు. గైడ్​లైన్స్ ప్రకారం ఒక్కో రైతు నుంచి 5 నుంచి 20 యూనిట్ల వరకు కొనుగోలు చేయొచ్చు. కానీ.. ఒక్కో రైతు నుంచి ఏకంగా వంద, రెండొందల యూనిట్ల గొర్రెలు కొన్నట్టు బిల్లులు పెట్టారు. ఒక్క యూనిట్​కు 21 గొర్రెల చొప్పున వంద యూనిట్లు అంటే రెండు వేల గొర్రెలు. ఒకే రైతు వద్ద ఇన్ని వేల గొర్రెలు ఎలా కొన్నారన్నది ప్రశ్న. ఈ అనుమానంతోనే నల్గొండ జిల్లాలో 1350 యూనిట్లకు చెందిన సుమారు రూ.18 కోట్ల బిల్లులు చెల్లించకుండా ఆపేసి, ఎంక్వైరీకి ఆదేశించారు.

ఫేజ్ 1లో రవాణా కాంట్రాక్టర్ దోపిడీ..

ఫేజ్ వన్​లో రవాణా కాంట్రాక్టర్ అక్రమాలకు పాల్పడినట్టు ఏజీ ఆడిట్​లో బయట పడింది. బోగస్ నంబర్లు వేసి రవాణా బిల్లులు స్వాహా చేసినట్టు అధికారులు గుర్తించారు. మిర్యాలగూడ, నకిరేకల్, నల్గొండ, చర్లపల్లికి చెందిన కాంట్రాక్టర్లకు గొర్రెల రవాణా అప్పగించారు. దీంట్లో మిర్యాలగూడకు చెందిన కాంట్రాక్టర్లు నకిలీ బిల్లులు పెట్టారు. టీఎస్05 యూఏ 3006 ఆటోనంబరు కాగా, లారీ నంబరుగాపేర్కొంటూ బోగస్​ బిల్లులు పెట్టారు. 

ఇంకొకరు ఏపీ 29 టీబీ 9231 ఆటో లో గొర్రెలు రవాణా చేసి ఆ నంబరుతో లారీలో ట్రాన్స్​పోర్ట్​చేసినట్టు బిల్లులు పెట్టారు. గైడ్​లైన్స్ ప్రకారం ఆటోల్లో గొర్రెలు రవాణా చేయడం కుదరదు. ఒక లారీలో ఆరు యూనిట్ల మాత్రమే రవాణా చేయాలి. కానీ ఎనిమిది యూనిట్లను రవాణా చేసినట్టు బిల్లులు పెట్టారు. దీనిపై తాజాగా ఇంటిలిజెన్స్ అధికారులు మిర్యాలగూడలోని కాంట్రాక్టర్​ను విచారించి ఆధారాలు రికార్డు చేసినట్టు తెలిసింది.

గొర్రెలు ఇవ్వడం ఉత్తదేనా?

రికార్డుల ప్రకారం గొర్రెలు కొనడం, అక్కడే ఫొటోలు దిగి జీవ సమృద్ధి వెబ్​సైట్​లో అప్​లోడ్ చేయడం, వాటి ట్రాన్స్​పోర్టేషన్​కు సంబంధించిన ఎవిడెన్స్ లు ఉన్నాయి. గొర్రెలు లబ్ధిదారులకు చేరగానే స్థానిక డాక్టర్లు వాటిని పరిశీలించినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. అయితే లబ్ధిదారులకు ఇచ్చిన గొర్రెలు ఏమైయ్యాయి? అన్నదే సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. దీంతో మొత్తం 5, 696 యూనిట్లలో కేవలం 1300 యూనిట్ల పైన అనుమానాలు తలెత్తాయి. అనుమానం వచ్చి దానికి సంబంధించి 20 మంది రైతుల పేమెంట్స్ సుమారు రూ.18.50 కోట్లు పెండింగ్​లో పెట్టారు.

గొర్రెల స్కీంలో కమీషన్లపై ఆరా

గొర్రెల పంపిణీ స్కీమ్‌‌‌‌‌‌‌‌ స్కామ్‌‌‌‌‌‌‌‌లో నిందితులు మాజీ సీఈఓ రాంచందర్‌‌‌‌‌‌‌‌, ఓఎస్డీ కల్యాణ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌లను ఏసీబీ రెండవరోజు కస్టడీలో విచారించింది. బుధవారం నాటితో కస్టడీ ముగియనుండడంతో కీలక విషయాలను సేకరించేందుకు యత్నించింది. గొర్రెల కొనుగోళ్లలో చేతులు మారిన కమీషన్ల వివరాలను రాబట్టింది. అయితే ఏసీబీ అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు నిందితులు ఇద్దరూ సరైన సమాచారం ఇవ్వలేదని తెలిసింది.

 తమ విధి నిర్వహణలో భాగంగానే స్కీమ్‌‌‌‌‌‌‌‌ను అమలు చేశామని చెప్పినట్లు సమాచారం. మంగళవారం రెండో రోజు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు వారిని ప్రశ్నించారు. ప్రధానంగా గొర్రెల కొనుగోళ్లలో కాంట్రాక్టర్లను నియమించడం, వారికి ఇచ్చే కమీషన్ల వివరాలను రాబట్టినట్లు తెలిసింది. కాంట్రాక్టర్లకు,లబ్ధిదారులకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేకపోయినా రూ.కోట్లు గోల్‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌ కావడంపై ఆరా తీసినట్లు తెలిసింది. అయితే, బుధవారం నాటితో కస్టడీ ముగియనుండడంతో వారిని మరోసారి కస్టడీ కోరేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.