Champions Trophy 2025: ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. భారత్‌ను ఓడించాలి: ఆ ఇద్దరికీ పాకిస్థాన్ ప్రధాని రిక్వెస్ట్

Champions Trophy 2025: ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. భారత్‌ను ఓడించాలి: ఆ ఇద్దరికీ పాకిస్థాన్ ప్రధాని రిక్వెస్ట్

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉండడం ఖాయం. మరోసారి ఐసీసీ ఈవెంట్స్ లో దాయాధి జట్లు తలపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఓడించడమే పాకిస్థాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్థాన్ గ్రూప్ దశలో తలపడనున్నాయి. ఆ దేశ ప్రధాని సైతం భారత్ ను ఓడించాలని పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు గట్టిగా చెప్పాడు. ఛాంపియన్స్  ట్రోఫీ గెలవడంతో పాటు ఫిబ్రవరి 23న దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌ను ఓడించడమే పాకిస్తాన్‌కు నిజమైన కర్తవ్యమని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అన్నారు.

శుక్రవారం రాత్రి గడాఫీ స్టేడియం ప్రారంభోత్సవంలో పాక్ ప్రధాని తమ ఆటగాళ్లు భారత్‌పై తమ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని కోరారు. ప్రారంభోత్సవ వేడుకల్లో పాక్ ప్రధాని షెబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. " ప్రస్తుతం మా జట్టు చాలా బాగుంది. ఇటీవలి కాలంలో వారు బాగా రాణించారు. కానీ ఇప్పుడు వారికి అసలైన సవాలు ఎదురు కానుంది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే కాకుండా దుబాయి వేదికగా జరగబోయే మ్యాచ్‌లో ప్రత్యర్థి భారత్‌ను ఓడించాలి. షహీన్ అఫ్రిది, నజీమ్ షా అద్భుతమైన బౌలర్లు. వారిద్దరూ భారత బ్యాటర్ల వికెట్లను తీస్తారని ఆశిస్తున్నా'. అని షరీఫ్ అన్నారు. 

ప్రస్తుతం క్రికెట్ ప్రేమికుల దృష్టి అంతా మరో 12 రోజుల్లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీపైనే ఉంది. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు.. అంటే 19 రోజుల పాటు అభిమానులను అలరించనుంది. ఫిబ్రవరి 19న కరాచీ వేదికగా ఆతిథ్య పాకిస్థాన్ జట్టు.. ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత జట్టు.. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడుతుంది. స్వదేశంలో జరగనుండడంతో పాకిస్థాన్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.

భారత్, ఆస్ట్రేలియా జట్లు కూడా టైటిల్ రేస్ లో ఉన్నాయి. హైబ్రిడ్‌ మోడల్‌లో జరగనున్న ఈ టోర్నీకి  పాకిస్థాన్‌తోపాటు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత జట్టు ఆడే మ్యాచ్‌లు దుబాయిలో జరగనుండగా.. మిలిగిన జట్లు తలపడే మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనున్నాయి.