యూనస్‌‌.. ఓ టెర్రరిస్ట్.. బంగ్లాలో నడుస్తున్నది టెర్రరిస్టుల సర్కార్: హసీనా

యూనస్‌‌.. ఓ టెర్రరిస్ట్.. బంగ్లాలో నడుస్తున్నది టెర్రరిస్టుల సర్కార్: హసీనా

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలో బంగ్లాదేశ్‌‌కు తిరిగి వస్తానని, అవామీ లీగ్ పార్టీ కార్యకర్తల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటానని వెల్లడించారు. తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు, నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ ఒక టెర్రరిస్ట్ అని ఆరోపించారు. మంగళవారం అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో షేక్ హసీనా జూమ్ కాల్ ద్వారా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.."అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలంతా ఓపికతో ఐక్యంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను. నేను మళ్లీ బంగ్లాదేశ్‌‌కు తిరిగి వస్తాను. పార్టీ కార్యకర్తల హత్యలకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను. గతేడాది ఆగస్టు 5న వారు నన్ను చంపడానికి ప్రయత్నించారు. కానీ నేను బతికి బయటపడ్డాను" అని హసీనా పేర్కొన్నారు. 

ఇప్పుడున్నది టెర్రరిస్టుల సర్కార్

తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు ముహమ్మద్ యూనస్‌‌కు ప్రభుత్వాన్ని నడిపిన అనుభవంలేదని హసీనా తెలిపారు. "అలర్లపై వేసిన అన్ని విచారణ కమిటీలను యూనస్‌‌ రద్దు చేశాడు. తనకు ఎదురు తిరిగిన వారిని చంపేయడానికి టెర్రరిస్టులను రిలీజ్ చేశాడు. వారు ఇప్పుడు బంగ్లాదేశ్‌‌ను నాశనం చేస్తున్నారు. ఈ టెర్రరిస్టుల  ప్రభుత్వాన్ని గద్దె దించాలి. కార్యకర్తల కుటుంబాలకు సహాయం చేయడానికి చేయగలిగినదంతా చేస్తాను" అని హసీనా హామీ ఇచ్చారు.