నిప్పుతో చెలగాటం ఆడొద్దు.. అది నిన్నే కాల్చేస్తుంది

నిప్పుతో చెలగాటం ఆడొద్దు..  అది నిన్నే కాల్చేస్తుంది
  • బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు యూనస్​కు హసీనా హెచ్చరిక

న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయిన యూనస్.. విదేశీయులతో కలిసి దేశం పతనానికి కుట్ర పన్నారని మండిపడ్డారు. ఆదివారం ఆమె తన మద్దతుదారులతో వర్చువల్ గా మాట్లాడారు. బంగ్లాదేశ్ చరిత్రను, ముఖ్యంగా దేశ స్వాతంత్ర్య పోరాటానికి అవామీ లీగ్ అందించిన సహకారాన్ని యూనస్ చెరిపివేస్తున్నారని ఆమె ఆరోపించారు. "బంగ్లాదేశ్ స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన అన్ని ఆనవాళ్లను యూనస్​తొలగిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తున్నారు. వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచడానికి మేము అన్ని జిల్లాల్లో ముక్తి జోద్ధా కాంప్లెక్స్‌‌‌‌లను నిర్మించాము. కానీ, ప్రస్తుతం వాటిని తగలబెడుతున్నారు. 

యూనస్ దీనిని సమర్థించగలరా? మీరు నిప్పుతో ఆడుకుంటే, అది మిమ్మల్ని కూడా కాల్చేస్తుంది" అని హసీనా అన్నారు. ‘‘స్వార్థపూరిత వ్యక్తి అయిన యూనస్.. అధికారం, డబ్బు కోసం విదేశీ కుట్ర పన్నాడు. దేశాన్ని నాశనం చేయడానికి విదేశీ సంపదను ఉపయోగించాడు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ -ఇ -ఇస్లామి.. అవామీ లీగ్ నాయకులను వేధింపులకు గురిచేస్తున్నాయి" అని ఆమె అన్నారు. విధ్వంసకారుల మరణాల కేసులో అవామీ లీగ్ నాయకులను ఇరికిస్తున్నారని, పోలీస్ స్టేషన్లను తగలబెట్టి, పోలీసులను కొట్టి చంపిన వారిపై అభియోగాలు మోపడం లేదన్నారు. దీంతో మా నాయకులు ఇండ్లళ్లో ఉండలేకపోతున్నారని అన్నారు. ఈ పరిణామాల గురించి యూనస్ కు బాగా తెలుసని.. కానీ, ఆయన అధికార దాహంతో నడుస్తున్నారని హసీనా అన్నారు. త్వరలోనే తాను బంగ్లాదేశ్‌‌‌‌కు తిరిగి వస్తానని, అందుకే అల్లా తనను బతికించాడని హసీనా పేర్కొన్నారు.