- కారులో నన్ను వెంబడించి ..వెహికల్ పై రాయితో దాడి చేసిన్రు
- ఆయన నుంచి ప్రాణహాని ఉందని ఆరోపణ
బెల్లంపల్లి, వెలుగు : బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మరో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి తాను కారులో వెళుతున్న సమయంలో మరో కారులో వెంబడించి తనపై రాయితో దాడి చేశారని ఆరిజిన్ డెయిరీ సీఏఓ బోడపాటి షేజల్ ఆరోపించారు. అదేరోజు రాత్రి బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల పోలీసు స్టేషన్ లో చిన్నయ్యతో పాటు మరో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేశానని మీడియాకు ఆమె ఫోన్ లో తెలిపారు.
తాను తాండూరు మండలం చౌటపల్లికి వెళ్లి రాత్రి బెల్లంపల్లికి తిరిగి వస్తుండగా తన కారు బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ శివారులోని హెచ్ పీ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగా, కారు టైరులో గాలి తగ్గడంతో పెట్రోల్ బంక్ పక్కనున్న టైర్ షాపుకు వెళ్లానని తెలిపారు. ఆ టైంలో మరో కారులో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు తన వెహికల్ వద్దకు వచ్చి కారు అద్దాలు తీయాలని బెదిరించారని పేర్కొన్నారు. అనంతరం మరో కారులో వచ్చిన వ్యక్తి తన కారుపై రాయితో దాడి చేశాడని, ఈ ఘటనలో తన కారు అద్దాలు ధ్వంసమయ్యాయని, వెహికల్ లో ఉన్న వ్యక్తి గాయపడ్డాడని ఆమె చెప్పారు.
చిన్నయ్య, ఆయన అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించారు. గతంలో కూడా దుర్గం చిన్నయ్య అనుచరులు తనపై బెల్లంపల్లిలో సెప్టెంబర్ ఒకటిన హత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. ఈ సంఘటనపై బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, తనకు ఏమైనా ఘటన జరిగితే పోలీసు అధికారులే పూర్తి బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు.