బెల్లంపల్లి ఏసీపీ ఆఫీస్ ఎదుట షేజల్ ధర్నా

బెల్లంపల్లి ఏసీపీ ఆఫీస్ ఎదుట షేజల్ ధర్నా
  • మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య, అనుచరులపై కేసు నమోదుకు డిమాండ్​

బెల్లంపల్లి, వెలుగు : తనపై హత్యాయత్నానికి పాల్పడ్డ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో పాటు అతడి అనుచరులు, బీఆర్ఎస్ లీడర్లపై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని  ఆదివారం బెల్లంపల్లి ఏసీపీ ఆఫీసు ఎదుట అరిజిన్ డెయిరీ సీఏవో బోడపాటి షేజల్ ధర్నా చేశారు. ఈ సందర్భంగా షేజల్ ​మాట్లాడుతూ.. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన బెల్లంపల్లి బజార్ ఏరియాలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు సన్ని బాబు, కొత్తపల్లి రాజ్ కుమార్, శ్యామ్ కుమార్, గోలి శివ, కుంబాల రాజేశ్, అలీ తనపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

ఘటనపై ఈ నెల18న బెల్లంపల్లి వన్ టౌన్ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పినా సీఐ, ఏసీపీ పట్టించుకోవడం లేదన్నారు. తనపై హత్యాయత్నం చేసిన బీఆర్ఎస్ లీడర్లకు పోలీసు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. బెల్లంపల్లి పోలీస్ అధికారులపై డీజీపీని కలిసి కంప్లయింట్​ చేస్తానన్నారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. అలాగే, ఆరిజిన్ డెయిరీ సంస్థ నుంచి తాండూర్​కు చెందిన రంగారావు పశువులను తీసుకెళ్లి ఈఎంఐ చెల్లించడంలేదని, అతడిపైనా తాండూర్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.