Ranji Trophy: 15 ఏళ్ళ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు దేశవాళీ పరుగుల వీరుడు రిటైర్మెంట్

Ranji Trophy: 15 ఏళ్ళ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్‌కు దేశవాళీ పరుగుల వీరుడు రిటైర్మెంట్

దేశవాళీ క్రికెట్ లో అద్భుత బ్యాటర్ గా పేరొందిన సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ తన 15 ఏళ్ళ ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు. ఫిబ్రవరి 11 (మంగళవారం) ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్టు ప్రకటించాడు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌లో గుజరాత్ చేతిలో సౌరాష్ట్ర 98 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. గత నెలలో జాక్సన్ వైట్-బాల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్ లో తన చివరి మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో విఫలమయ్యాడు. గుజరాత్ తో జరిగిన  క్వార్టర్ ఫైనల్‌లో  తొలి ఇన్నింగ్స్ లో 14 పరుగులు చేసిన అతను రెండో ఇన్నింగ్స్ లో 27 పరుగులు చేశాడు. 

ALSO READ | Legends 90 league: 49 బంతుల్లోనే 160 పరుగులు.. క్రికెట్ చరిత్రలోనే విధ్వంసకర ఇన్నింగ్స్

ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‌లో జాక్సన్ 11 ఇన్నింగ్స్‌ ల్లో 30.36 సగటుతో 334 పరుగులు చేశాడు. "నేను ఇంత దూరం చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ దేవుడు దానిని సాధ్యం చేశాడు". అని జాక్సన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశారు. 38 ఏళ్ల జాక్సన్ 100 కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లాడిన భారత క్రికెట్ జట్టులో ఒక్కసారి కూడా స్థానం సంపాదించలేకపోయాడు. ఓవరాల్ గా అతను   106 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ల్లో 45.80 సగటుతో 7283 పరుగులు చేశాడు. వీటిలో 21 సెంచరీలు.. 39 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మ్యాచ్ తర్వాత సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అతనికి షీల్డ్ బహూకరించి సత్కరించింది. 

జాక్సన్ 15 ఏళ్లుగా సౌరాష్ట్ర జట్టుకు మూల స్తంభంలా నిలిచాడు. నమ్మకైన బ్యాటర్ గా మెరుపు ఫీల్డర్ గా రాణించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో సౌరాష్ట్ర తరఫున వికెట్ కీపర్‌గా తన సేవలను అందించాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన జాక్సన్ విఫలమయ్యాడు. 9 మ్యాచ్ ల్లో 8 ఇన్నింగ్స్ ల్లో కేవలం 61 పరుగులే చేశాడు.