కంచ ఐలయ్య షెపర్డ్‌‌‌‌ మా జాతి సూర్యుడు

 కంచ ఐలయ్య  షెపర్డ్‌‌‌‌ మా జాతి సూర్యుడు

 కంచ ఐలయ్య షెపర్డ్‌‌‌‌కు ఈ నెల 13వ తేదీన కర్నాటకలోని కనకపీఠం(కలబురిగి డివిజన్‌‌‌‌) ‘మా జాతి సూర్యుడు’ అనే పేరుతో అవార్డును ఇస్తుంది. ఈ అవార్డును కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఐలయ్యకి ప్రదానం చేస్తారు. 1509లో పుట్టి 1609లో  పరమపదించిన కనకదాసు పేరుతో ఈ కనకపీఠం కర్నాటకలో స్థాపించారు. ఈ పీఠమే కర్నాటక కురుబ (షెపర్డ్) ను రాజకీయంగా కూడా ఏకం చేసింది. ఈ పీఠాధిపతికి మొత్తం కన్నడ సమాజంలో చాలా గొప్ప గౌరవం ఉంది. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఈ పీఠాన్ని సందర్శించి పీఠాధిపతి ఆశీర్వాదం తీసుకుంటారు.  ఈ పీఠం ప్రజాహిత కార్యక్రమాలు చాలా చేస్తోంది. ఎందరినో  విద్యావేత్తలుగా తీర్చిదిద్దుతున్నది.

కంచ ఐలయ్య తెలంగాణలో  కురుమ కులంలో పుట్టి చిన్నప్పుడు గొర్రెలు కాచుకుంటూ చదువుకుని, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌‌‌‌గా 38 సంవత్సరాలు సేవలందించారు. అయితే ఉస్మానియా యునివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేటు కూడా ఇవ్వలేదు. ప్రపంచంలో మొదటిసారి బుద్ధుని రాజకీయ తత్వం మీద పీహెచ్ డీ చేసిన మేధావి ఐలయ్య. ఆయన పుస్తకాలు ప్రపంచస్థాయి గుర్తింపు పొందాయి.  ఆయనకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన అణచివేయబడ్డ కులాల విముక్తి మేనిఫెస్టో.  వై అయామ్‌‌‌‌ నాట్‌‌‌‌ ఏ హిందూ (నేను హిందువునెట్లయిత?) పుస్తకం.  కురుమ కుల జీవితంతో ముడివేయబడి రాశారు.

 1996లో ఈ పుస్తకం ఇంగ్లీష్​లో అచ్చయి దేశంలో బెస్ట్‌‌‌‌ సెల్లర్‌‌‌‌గా పేరొందింది, ఎన్నో మలి ముద్రణలు జరిగి ప్రపంచ మేధావి వర్గాలకు భారతదేశ ఉత్పత్తి కులాల గొప్పతనాన్ని ఈ పుస్తకం పరిచయం చేసింది. అక్కడి నుంచి ‘పోస్ట్‌‌‌‌ హిందూ ఇండియా’ (హిందూ అనంతర భారతదేశం),  ‘బఫెలో నేషనలిజం’, 'అంటరాని దేవుడు’, 'దేవుడి రాజకీయ తత్వం’  పుస్తకాలను ఒక గొర్రెల కాపరి తనలోని మానవత్వ దృక్పథంతో రాశాడు. ఆ రచనలు ఈ దేశంలో ఎన్నో మార్పులు తేనున్నాయి.

నిరాకార దేవుడు షెపర్డ్​

విగ్రహాలుగా మన ముందుకొచ్చిన దేవుళ్లు కాకుండా మానవ జాతి నమ్మే నిరాకార దేవుడికి   షెపర్డ్‌‌‌‌ అనే పేరుంది. ఆ పేరు కూడా గొర్రెల కాపరికుండే జంతుప్రేమ, కాపరితనం, మానవ జంతు సమానత్వ ఆలోచన నుంచి వచ్చింది. ప్రపంచ దేశాల్లో  షెపర్డ్..​ సెయింట్‌‌‌‌ కన్నా, రాజుకన్నా,  మంత్రికన్నా, గొప్పవాడుగా చూపబడతాడు. అందుకే చాలా మత గ్రంథాల్లో దేవుడిని షెపర్డ్‌‌‌‌గా పిలిచారు. ఇది గమనించిన ఐలయ్య 2016లో  తన పేరు చివరన షెపర్డ్​ అని పెట్టుకున్నాడు. ఆయన ఇన్ని పుస్తకాలు రాసినా ఆయన పేరు కంచ ఐలయ్యగానే ఉంటే, పేరు చివర షెపర్డ్‌‌‌‌ అనే పదంగానీ లేకుంటే కనకదాసు పీఠం ఆయనను కురుమ కులస్తుడనే విషయాన్ని అర్థం చేసుకునేది కాదు.  

ఆయన జీవితం (ఫ్రం ఎ షెపర్డ్​ బాయ్‌‌‌‌ టు ఆన్‌‌‌‌ ఇంటలెక్చువల్‌‌‌‌) పుస్తకంలో వివరంగా ఉన్నది.  ఆయన రచనలు కురుమ(కురుబ) కులాన్నే కాక మొత్తం అణచివేయబడ్డ కులాలను చీకటిలో నుంచి సూర్యకాంతిగల వెలుగులోకి నడిపించాయి. ఆయన ఇంగ్లీష్​ భాషలో పేరు చివర షెపర్డ్‌‌‌‌ అని పెట్టుకోవడం, ఇంగ్లీష్​ పుస్తకాలు రాయడం వల్ల ఉత్పత్తి కులాలకు సూర్యుడై ఆయన రచనా రంగాన్నే మార్చేశాడు. ఆయనకు అంత గౌరవప్రదమైన కనకదాసు పీఠం ఈ బిరుదునిస్తే ఎంతదరిద్రపు శూద్ర దినాలు వచ్చాయని తల పట్టుకునే శక్తులు చాలానే ఉన్నాయి. 

వేల సంవత్సరాలు గొర్రెల కాపరులను, బర్రెల కాపరులనుగొర్లకంటే, బర్లకంటే, కుక్కల కంటే కూడా తక్కువ చూసిన శక్తులున్నాయి. కానీ, ఈ షెపర్డ్‌‌‌‌ తన పెన్నుతో వాళ్ల మెదళ్లను సర్జరీ చేశాడు. కుల వ్యవస్థను కూకటి వేళ్లతో కూల్చాలంటే దొంతర్ల వారీగా ఏర్పడ్డ శ్రమ అగౌరవాన్ని మార్చి సమాన గౌరవాన్ని ఇవ్వాలని ఆయన ‘శ్రమ గౌరవ పాఠాలు’ అనే పుస్తకాన్ని రాశాడు.  చెప్పులు చేసే పని, పశువులు కాసే పని.. ఒక పూజారి పని కంటే, ఒక ఉపాధ్యాయుని పనికంటే గొప్ప అని తెలియజెప్పాడు. కుల వ్యవస్థ దొంతర్లను కూల్చడంలో ఈ ఆలోచన వివ్లవాత్మకమైనది. 

- కొంగల  పాండు షెపర్డ్‌‌‌‌, ఉస్మానియా యూనివర్సిటీ