ఖమ్మం టౌన్, వెలుగు : అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లకు అదనపు ఈవీఎంలను తరలించినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శనివారం న్యూ కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా స్ట్రాంగ్ రూమ్ లకు ఈవీఎంల తరలింపును ఆయన పరిశీలించి మాట్లాడారు.
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న నేపథ్యంలో మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతున్నాయని తెలిపారు. పోలింగ్ నిర్వహణకు గతంలో కేటాయించిన ఈవీఎం యంత్రాలకు అదనంగా బ్యాలెట్ యూనిట్లను ర్యాండమైజేషన్ ద్వారా జిల్లాలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కేటాయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, సంబంధిత అధికారులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
పారదర్శకంగా ఈవీఎంల కేటాయింపు
లోకసభ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వారీగా పారదర్శకంగా ఈవీఎం యంత్రాల కేటాయింపు పూర్తి చేసినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఖమ్మం లోకసభ ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ సంజయ్ జి కోల్టే తో కలిసి ఆయన ఈవీఎంల రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. రెండో ర్యాండమైజేషన్ కు సంబంధించి హర్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా రెవెన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఓటింగ్ జాగ్రత్తగా నిర్వహించాలి
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ను జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వీలుగా స్థానిక ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ను ఆయన శనివారం పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో పోలింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర నిఘా బృందాలు, మైక్రో పరిశీలకులు, పోలీస్, సెక్టార్ అధికారులు, ఎన్నికల వీధుల్లో ఉన్న ఇతర అధికారులు, సిబ్బంది మొత్తంగా 10,907 మందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రం కోసం చేపడుతున్న ఏర్పాట్లను సీపీ సునీల్ దత్ తో కలిసి ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు.