స్ట్రాంగ్ రూమ్​లకు ఈవీఎంల తరలింపు

  •    పరిశీలించిన రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు :  అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​లకు ఈవీఎం యంత్రాలను తరలిస్తున్నామని  ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ తర్వాత న్యూ కలెక్టరేట్ ఆవరణలోని గోడౌన్ ​నుంచి ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్​లకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్​ తెరిచి ఈవీఎంలను టీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీసుల్లో పటిష్ట భద్రత మధ్య తరలిస్తున్నామని చెప్పారు.

ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు 440 బ్యాలెట్ యూనిట్లు, 440 కంట్రోల్ యూనిట్లు, 497 వీవీ ప్యాట్లు, పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ కు 359 బ్యాలెట్ యూనిట్లు, 359 కంట్రోల్ యూనిట్లు, 406 వీవీ ప్యాట్లు తరలిస్తున్నట్లు చెప్పారు.  వైరా అసెంబ్లీ సెగ్మెంట్ కు 312 బ్యాలెట్ యూనిట్లు, 312 కంట్రోల్ యూనిట్లు, 352 వీవీ ప్యాట్లు, మధిర అసెంబ్లీ సెగ్మెంట్ కు 332 బ్యాలెట్ యూనిట్లు, 332 కంట్రోల్ యూనిట్లు, 375 వీవీ ప్యాట్లు, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ కు 364 బ్యాలెట్ యూనిట్లు

364 కంట్రోల్ యూనిట్లు, 411 వీవీ ప్యాట్లు తీసుకెళ్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు బీ. సత్యప్రసాద్, డీ. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, ట్రైనీ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, మిర్నల్ శ్రేష్ఠ, డీఆర్వో ఎం. రాజేశ్వరి, ఆర్డీవోలు గణేశ్, రాజేందర్, తహసీల్దార్లు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలి

ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. ఆదివారం న్యూ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్​లో సహాయ రిటర్నింగ్ అధికారులతో లోకసభ సాధారణ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్నికల పనులు నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలన్నారు.

మే 3, 4 తేదీల్లో ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్, కమీషనింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పారు. ఈ నెల 25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ చేపట్టాలన్నారు. బూత్ లెవల్ అధికారులకు అవగాహన కల్పించాలని సూచించారు.