జపాన్ కొత్త ప్రధానిగా ఇషిబా

జపాన్ కొత్త ప్రధానిగా ఇషిబా
  • అధికార పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక.. వచ్చే వారం ప్రధానిగా బాధ్యతలు

టోక్యో: రక్షణ శాఖ మాజీ మంత్రి షిగెరు ఇషిబా జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో తొమ్మిది మంది పోటీపడగా.. ఇషిబా గెలుపొందారు. అధికార పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వారే జపాన్​లో ప్రధాన మంత్రి పదవి చేపడతారు. ప్రస్తుత ప్రధాని కిషిడ పదవీకాలం అక్టోబర్ 1 తో ముగియనుంది. ఆ తర్వాత ఇషిబా ప్రధాని పదవిని చేపడతారు. ఎల్డీపీ అధ్యక్ష పదవికి పోటీ పడడం ఇషిబాకు ఇది ఐదోసారి.

ఈ ఎన్నికల్లో తాను గెలిచినట్లు టోక్యోలో అధికారులు ప్రకటించడం విని ఇషిబా భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తన సహాయకులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యం ఇస్తానని, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, స్వేచ్ఛగా బతికేలా చూస్తానని పేర్కొన్నారు. కాగా, షిగెరు ఇషిబా రాజకీయాల్లోకి రాకముందు బ్యాంకింగ్  రంగంలో పనిచేశారు. 29 ఏండ్ల వయసులో మొదటిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. గత ఎల్డీపీ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేశారు.