Shikhar Dhawan: ఆటకు గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్

Shikhar Dhawan: ఆటకు గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్

భారత మాజీ క్రికెటర్, ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 13 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌కు శనివారం(ఆగష్టు 24) ముగింపు పలికాడు. దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌కు ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గబ్బర్.. డిసెంబర్ 2022లో చివరిసారి భారత జట్టులో కనిపించాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన అద్భుత ఆటతీరుతో ఆనతీ కాలంలోనే మూడు ఫార్మాట్లలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

గబ్బర్ అంటే విధ్వంసానికి మరో పేరు. క్లాసిక్ షాట్లతో బౌండరీల వర్షం కురిపించేవాడు. ఒకప్పుడు ధావన్ భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు మూల స్తంభం. కానీ శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్ వంటి కుర్ర క్రికెటర్ల రాకతో కథ పూర్తిగా మారిపోయింది. మరోవైపు, భార్యతో విబేధాలు అతని కెరీర్ ను మరింత నష్టపరిచాయి. జాతీయ జట్టుకు దూరమైనప్పటికీ, గబ్బర్ ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ సీజన్ వరకూ ఆడాడు. గాయం కావడంతో మధ్యలోనే వైదొలిగాడు.

భారత జట్టు తరఫున 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడిన ధావన్.. వరుసగా వన్డేల్లో 6793, టెస్టుల్లో 2315, టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు ధావన్‌ ఖాతాలో ఉన్నాయి.