Shikhar Dhawan: బాధతోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు.. ధావన్ కెరీర్‌లో హైలెట్స్ ఇవే

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాళీ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి బిగ్ షాక్ ఇచ్చాడు. ఆడే  సామర్ధ్యమున్నా.. ఫామ్ లోనే ఉన్నా ధావన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది. 13 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌కు శనివారం(ఆగష్టు 24) ముగింపు పలికాడు. 2010లో విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గబ్బర్.. డిసెంబర్ 2022లో చివరిసారి భారత జట్టులో కనిపించాడు. తన కెరీర్ లో ధావన్ భారత జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతని కెరీర్ లో ఒకసారి హైలెట్స్ చూద్దాం. 

ధావన్ అంటే ముందుగా అతని వన్డే కెరీర్ గుర్తుకొస్తుంది. ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ధావన్ ఓపెనర్ గా తనదైన ముద్ర వేశాడు. ఒకవైపు రోహిత్ క్రీజ్ లో కుదురుకోవడానికి సమయం తీసుకుంటే శిఖర్ మాత్రం బౌండరీలతో చెలరేగేవాడు. ముఖ్యంగా పెద్ద టోర్నీల్లో ధావన్ రికార్డ్ అద్భుతంగా ఉంది. వరల్డ్ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆసియా కప్ లో కోహ్లీ, రోహిత్ కంటే ఎక్కువగా నిలకడ చూపించేవాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో 363 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. 2017 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ తరపున ధావన్ 338 పరుగులతో ధావన్ టాప్ స్కోరర్.

2014 ఆసియా కప్ లోనూ ధావన్ (192) భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిస్తే.. 2018 ఆసియా కప్ లో 342 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నాడు. 2015 వన్డే వరల్డ్ కప్ లోనూ టీమిండియా తరపున 412 పరుగులతో  ధావన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో బిగ్ టోర్నీ అంటే ధావన్ బ్రాండ్ గా నిలిచేవాడు. టెస్టుల్లో తొలి మ్యాచ్ లోనే 188 పరుగులు చేసి డెబ్యూ మ్యాచ్ లోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు. 

శిఖర్ ధావన్ కి 2023 వన్డే వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కని సంగతి తెలిసిందే. ఆసియా కప్ లో స్థానం దక్కకపోయినా.. వరల్డ్ కప్ లో తనను తీసుకుంటారని అంతా భావించినా.. ఈ సీనియర్ ఆటగాడికి నిరాశ తప్పలేదు. ఐసీసీ టోర్నీల్లో అద్భుత  రికార్డ్ కలిగి ఉన్నప్పటికీ ఫామ్ లేని కారణంగా వరల్డ్ కప్ జట్టులో ధావన్ ని సెలక్ట్ చేయలేదు. భారత జట్టు తరఫున 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20లు ఆడిన ధావన్.. వరుసగా వన్డేల్లో 6793, టెస్టుల్లో 2315, టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు ధావన్‌ ఖాతాలో ఉన్నాయి.