శిఖర్ ధవన్.. కొంతకాలం టెస్ట్, వన్డే, టీ20 క్రికెట్ ని శాషించిన ఈ పేరు క్రమక్రమంగా గాడి తప్పి జట్టులో చోటుకోసం పాకులాడే స్థితికి పడిపోయింది. మొదట టెస్ట్, తర్వాత టీ20 టీంల్లో చోటు కోల్పోయిన ధవన్, ఇప్పుడు వన్డే జట్టులోనూ ప్లేస్ కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం.. వెస్టిండీస్, శ్రీలంక, జింబాంబ్వే, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో ఆడిన గత సిరీస్ ల్లో ఫెయిల్ అవ్వడమే. ధవన్ గత ఆటను, సీనియారిటీని నమ్మి చాన్స్ లు ఇస్తున్న ప్రతీసారి జట్టుకు అండగా నిలబడలేకపోయాడు.
అయితే, ప్రస్తుతం టీం ఇండియాలో ఉన్న కాంపిటీషన్ తో ధవన్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఇషాన్ కిషన్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ఓపెనింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్లు అవకాశాలు వచ్చిన ప్రతీసారి టాలెంట్ ని రుజువు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా ఇషాన్ చాన్స్ రావడంతోనే రెచ్చిపోయి డబుల్ సెంచరీ చేసి, సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. టీ20లో ధవన్ స్థానాన్ని రాహుల్ భర్తీ చేయగా, టెస్ట్ ల్లో శుభ్ మన్ గిల్ లాగేసుకున్నాడు. ఇక మిగిలిన వన్డే ఫార్మెట్ లో ఓపెనర్ గా చేయడానికి చాలామంది యంగ్ స్టర్స్ రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 10న శ్రీలంకతో, 18న న్యూజిలాండ్ తో ప్రారంభం కాబోయే భారత్ వన్డే సిరీస్ లకి ధవన్ ని ఎంపిక చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అయితే, ఈ సిరీస్ లో గనుక ధవన్ ని పక్కన బెడితే ఇక జట్టులో తిరిగి చోటు దక్కించుకోవడం చాలా కష్టం.