
ఓటు హక్కు ఉన్న వారికే సంక్షేమ ఫలాలు అందే ఈ రోజుల్లో.. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ పథకం అందరి మన్ననలు పొందుతోంది. భజన్ లాల్ శర్మ(Bhajan Lal Sharma) ప్రభుత్వం కొత్తగా పాఠశాల విద్యార్థుల కోసం ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది. శిక్షా సంజీవని బీమా యోజన(Shiksha Sanjeevani Yojana) పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం.. 1 నుండి 5 వ తరగతి వరకు విద్యార్థులకు లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా అందిస్తుంది.
దేశంలో విద్యార్థులకు ఈ తరహా ప్రయోజనాలు అందిస్తున్న మొదటి పథకం ఇదే. తల్లిదండ్రులు మరణిస్తే.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థులు చదువు మానేయాల్సిన అవసరం లేకుండా చూసుకోవడమే ఈ పథకం ప్రాథమిక లక్ష్యం. విద్యార్థుల్లో చదువుకోవాలనే కోరికను పెంచడం, బాల కార్మికులను నిరోధించడం, విద్యార్థులు.. వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం ఈ పథకం ఉద్దేశం.
Also Read :- ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ కొట్టరు
రాష్ట్ర విద్య, పంచాయతీ రాజ్ మంత్రి మదన్ దిలావర్(Madan Dilawar) రెండ్రోజుల క్రితం ఉదయపూర్‌లోని ఓ సెకండరీ స్కూల్‌లో ఈ పథకాన్ని ప్రారంభించారు. తొలివిడతగా ఉదయపూర్ డివిజన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 1.3 లక్షల మంది విద్యార్థులను ఈ పథకం కిందకు తీసుకొచ్చారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని విస్తరించనున్నారు. ఈ పథకం కింద విద్యార్థులు రూ. లక్ష వరకు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని పొందుతారు.
రాజస్థాన్ విద్యా మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం, ప్రమాదం కారణంగా విద్యార్థి తల్లిదండ్రులు మరణించిన కేసులను ఈ బీమా కవర్ చేస్తుంది. అనగా, అనుకోకుండా విద్యార్థి తల్లిదండ్రులు చనిపోతే.. వారి చదువులకు ఆటంకాలు లేకుండా ఆర్థిక సాయం అందిస్తుంది.
పథకం లక్ష్యాలు..
- బాల కార్మికులను నిరోధించడం
- డిజిటల్ ఇండియా చొరవ ద్వారా ఆర్థిక వ్యవహారాలపై అవగాహన
- చిన్నప్పటి నుంచే పొదుపు అలవాట్లను ప్రోత్సహించడం వంటివి.
ఈ పథకం కింద.. విద్యార్థి అనుకోకుండా తల్లిదండ్రులను కోల్పోతే, వారికి 18 సంవత్సరాల వయస్సు వరకు స్కాలర్‌షిప్ అందించబడుతుంది.