ఆస్తుల అటాచ్ మెంట్ కేసులో శిల్పా శెట్టి దంపతులకు హైకోర్టులో ఊరట.

ఆస్తుల అటాచ్ మెంట్ కేసులో శిల్పా శెట్టి దంపతులకు హైకోర్టులో ఊరట.

ఇటీవలే మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా  దంపతులకి తమ ఆస్తులు ఖాళీ చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ తీర్పుని సవాలు చేస్తూ శిల్పా శెట్టి దంపతులు బాంబే హైకోర్టుని ఆశ్రయించగా ఊరట లభించింది. 

ఇందులో భాగంగా తమ అప్పీలుపై నిర్ణయం తీసుకునే వరకు ఈడీ  నోటీసులను అమలు చేయబోదని కోర్టు తెలిపింది. దీంతో  ఈడీ కూడా ఈ విషయంపై స్పందిస్తూ శిల్పాశెట్టి, రాజ్‌ కుంద్రాల అప్పీల్‌పై ఉత్తర్వులు వెలువడే వరకు వారికి జారీ చేసిన నోటీసులు అమలు చేయబోమని బాంబే హైకోర్టులో పేర్కొంది.

అయితే  శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా  దంపతులకి తమ  ఆస్తులను ఖాళీ చేయాలని సెప్టెంబర్ 27న తొలగింపు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం రిపు సుదన్ కుంద్రా, అకా రాజ్ కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్లు జప్తు చేశారు. అలాగే శిల్పాశెట్టి దంపతులకి సంబంధించిన స్థిరాస్తులు మరియు ముంబైలోని ఫామ్ హౌజ్ అటాచ్ చేశారు.

ఈ విషయం ఇలా ఉండగా 2017లో బిట్‌కాయిన్‌ల రూపంలో నెలకు 10 శాతం రిటర్న్ ఇస్తామని  ప్రజల నుంచి రూ. 6,600 కోట్లు  నిధులు సేకరించినట్లు పలువురు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు మరియు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది.