లాక్ డౌన్ తో భారీగా ఆదాయం కోల్పోతున్న షిర్డీ ఆలయం

లాక్ డౌన్ తో భారీగా ఆదాయం కోల్పోతున్న షిర్డీ ఆలయం

కరోనాను అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ దేశంలోని ఆలయాలన్నిటిపైనా పడింది. లాక్ డౌన్ తో అన్ని ఆలయాలు మూతపడ్డాయి. దీంతో ప్రతీ రోజు వేలాది మంది భక్తులతో కళకళలాడే ప్రముఖ ఆలయాలు పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ఇందులో భాగంగానే కోట్లాది మంది ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే షిర్డీ సాయి ఆలయం కూడా కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతోంది. ప్రతి రోజు రూ. 1.58 కోట్లకు పైగా ఆదాయాన్ని నష్టపోతోంది. మార్చి 17 నుంచి మే 3వ తేదీ వరకు ఆన్ లైన్ డొనేషన్ల రూపంలో ఆలయానికి రూ. 2.53 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అంటే రోజుకు దాదాపు రూ. 6 లక్షలు మాత్రమే ఆదాయంగా వచ్చింది.

మామూలుగా అయితే షిర్డీ ఆలయానికి విరాళాల రూపంలో ఏడాదికి రూ. 600 కోట్ల ఆదాయం సమకూరుతుంది. అంటే ప్రతిరోజు సరాసరి రూ. 1.64 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ లెక్కన లాక్ డౌన్ కారణంగా ప్రతి రోజు రూ. 1.58 కోట్ల ఆదాయాన్ని కోల్పోతోంది. జూన్ వరకు లాక్ డౌన్ కొనసాగితే టెంపుల్ ట్రస్ట్ ఏకంగా రూ. 150 కోట్ల వరకు నష్టపోతుంది. ఈ నష్టం ఆలయ ట్రస్టు చేపడుతున్న పలు సామాజిక సేవా కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు ఆలయ నిర్వాహకులు.