
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్లో దారుణ హత్యకు గురైన యువతి శిరీష బావను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాలు.. జూన్ 10 న అనిల్ (మృతురాలి బావ) శిరీషను తిట్టాడు. దీంతో ఇంట్లో నుంచి ఆమె అలిగి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో జూన్ 11 న గ్రామ శివారులోని కుంటలో శిరీష మృతదేహం లభించింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
బావతో జరిగిన గొడవపై వారు ఆరా తీశారు. అనిల్ భార్య లలిత మాట్లాడుతూ.. ఇంట్లో పని చేయడం లేదని మాత్రమే తన చెల్లిని మందలించినట్లు చెప్పారు. తన చెల్లికి ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవని యువతి సోదరుడు తెలిపాడు. తల్లి ఆరోగ్యం బాలేకపోవడంతో తాను హైదరాబాద్ వెళ్లినట్లు చెప్పాడు. చెల్లి హత్య విషయం తనకూ మధ్యాహ్నమే తెలిసినట్లు మీడియాకి వెల్లడించాడు. కాగా శిరీష మృతదేహానికి ఇంకా పోస్ట్మార్టం పూర్తి కాలేదు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.