ఎందుకిలా తారుమారైంది!

పవర్​ పాలిటిక్స్​లో శివసేన ఈసారి ముందుకు దూసుకొచ్చింది. పెద్దన్నగా పాతికేళ్లపాటు చేయిపట్టుకు నడిపించిన బీజేపీని పక్కకి నెట్టేసింది. ఇప్పుడు కాకపోతే మరింకెప్పుడు కాదు అన్నట్లుగా చొరవ తీసుకుంది. ఫలితాలు వచ్చాక ఎక్కడా లొంగకుండా అనుకున్నది సాధించాలనుకుంది. అయితే, కాంగ్రెస్​, ఎన్సీపీల నుంచి సపోర్ట్​ లెటర్స్​ రాబట్టలేక ఫెయిలైంది.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్​ ఇప్పుడు ఎన్సీపీకి దక్కబోతోంది.  అసలు శివసేనకు, బీజేపీకి మధ్య స్నేహం ఎక్కడ చెడిందన్నది చాలా ఇంట్రెస్టింగ్​ పాయింట్​.

పాతికేళ్ల క్రితమే మహారాష్ట్రలో అధికారాన్ని చెలాయించిన శివసేన… ఆ తర్వాత సొంతంగా ఎదగలేకపోయింది. 1995లో సాధించిన 73 అసెంబ్లీ సీట్లే శివసేన చరిత్రలో ఎక్కువ తెచ్చుకున్న సీట్లు. మళ్లీ అన్ని సీట్లు గెలవలేకపోయింది.  ఆ ఎన్నికల్లో 65 సీట్లు తెచ్చుకున్న బీజేపీ… 2014లో 122 సీట్లకు ఎదిగింది. తాజా ఎన్నికల్లో 105 సీట్లకు తగ్గింది. ఇక శివసేనకు మంచి పట్టున్న ముంబై నగరంలోనూ శివసేన ఎదుగుదల పెద్దగా లేదు. బృహన్ ముంబై కార్పొరేషన్​లో 2007 నుంచి 2017 వరకు చూసుకుంటే 84 సీట్ల దగ్గరే ఉండిపోయింది. బీజేపీ మాత్రం 28 సీట్ల నుంచి 82 సీట్లకు చేరింది.

మొత్తంగా చూసినప్పుడు బీజేపీ మిత్రలాభం పొందుతుండగా, శివసేన ఆ మేరకు ఎదగడం లేదన్నది స్పష్టం. ఇప్పుడు శివసేనలో మూడో తరం ప్రవేశించింది. గతంలో మాదిరిగా కింగ్​మేకర్లుగా ఉండడానికి ఇష్టపడడం లేదు. ఈ పరిణామం నుంచే ఉద్దవ్​ థాక్రే కొడుకు ఆదిత్య రైజయ్యాడు. మహారాష్ట్ర రాజకీయాలు ఈ యూత్​ లీడర్​ చుట్టూనే తిరుగుతున్నాయి. శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ ఒక అజెండాతో ఆదిత్యను ప్రమోట్​ చేస్తూ వచ్చింది. దానిని నడిపించే రాజ్యసభ ఎంపీ సంజయ్​ రౌత్​ మాటల్లో చెప్పాలంటే… ‘రాస్తే కి పర్వా కరుంగా తో మంజిల్​ బురా మాన్​ జాయేగీ (లక్ష్యాన్ని చేరుకోవాలంటే మార్గాన్ని పట్టించుకోకూడదు)’. ఆదిత్యను కింగ్​గా నిలబెట్టడమే శివసేన లక్ష్యం. అందుకే ఫలితాలు వెల్లడై 17 రోజులైపోయినా ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి సహకరించకుండా మొండికేసి కూర్చుంది.

ఈ మొండితనానికి కారణం లేకపోలేదని ఎనలిస్టులు అంటున్నారు. ఉద్దవ్​ థాక్రే ఉద్దేశంలో ఇంకా ఎంతకాలం బీజేపీకి తోక పార్టీలా ఉంటామన్న ఆలోచన కనబడుతోంది. తమకు గట్టిపట్టున్న ముంబై నగరంలో బీజేపీ చాపకింద నీరులా ప్రవేశించడం పెద్ద కారణంగా ఎనలిస్టులు చెబుతున్నారు. ముంబైలోని అతి పెద్ద మురికివాడైన థారవిలో అయిదు లక్షల మందికి పక్కా ఇళ్లను కట్టించిన క్రెడిట్​ తమదేనని శివసేన చెప్పుకుంటుంది. అలాగే, ముంబైలో ఇతర రాష్ట్రాలవారిని కంట్రోల్​ చేస్తూ, మరాఠీలకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేలా చూశామన్నదికూడా ఆ పార్టీ వాదన. ఇంత కష్టపడి ముంబైలో తాము సంపాదించిన పలుకుబడిని బీజేపీ ఓట్లుగా మలచుకోవడాన్ని ఉద్దవ్​ జీర్ణించుకోలేకపోతున్నారని ఎనలిస్టులు అంటున్నారు.

తెగేవరకు లాగిందా!

ఇక, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజెపీ లీడర్లు తమను వెన్నుపోటు పొడిచారన్న ఆరోపణలుకూడా శివసైనికులు చేస్తున్నారు. 2014లో వేర్వేరుగా పోటీ చేసినప్పుడు 63 సీట్లు సాధించామని, ఇప్పడు పొత్తులతో పోటీకి దిగి కేవలం 56 సీట్ల దగ్గరే ఆగిపోవడమేమిటని అడుగుతున్నారు. ఇదే ఆరోపణ బీజేపీకూడా చేస్తోంది. అప్పట్లో తాము 122 సీట్లు సాధించామని, ప్రస్తుతం 105 సీట్లకు తగ్గిపోవడానికి కారణం శివసైనికులేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెగేవరకు లాగింది శివసేన.  అటు ఎన్సీపీతో, ఇటు కాంగ్రెస్​తో మంతనాలు సాగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్​ భగత్​ సింగ్​ కోషియారీ పిలిచినా, ఆ రెండు పార్టీల మద్దతు లేఖల్ని శివసేన పొందలేకపోయింది. ఇన్ని ట్విస్ట్​ల మధ్య మహారాష్ట్ర రాజకీయం ఎటు మలుపు తిరగనుందో!